జగన్మోహన్ రెడ్డి విషయంలో  నరసాపురం ఎంపి కనుమూరి రఘురామ కృష్ణంరాజు తిరుగుబాటు లేవదీసినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు, ఎంపి తాజా మాటలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. కృష్ణంరాజు మొదటి నుండి తేడాగానే ఉంటున్నారు. పార్టీలో ఎంపిలందరు పార్టీ లైన్ ప్రకారమే నడుచుకుంటుంటే ఈ ఎంపి మాత్రం తనకిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. పైగా పార్టీకి డ్యామేజ్ జరిగేట్లు మాట్లాడుతున్నారు. ఎల్లోమీడియాతో పార్టీ నేతలెవరూ మాట్లాడకూడదనే ఆదేశాలున్నా వాటిని ధిక్కరించి ఎల్లోమీడియాతోనే ఎక్కువగా మాట్లాడుతున్నాడు.

 

సరే ఇంతకాలం కృష్ణంరాజు ఏమి మాట్లాడాడు అన్న విషయాలను పక్కనపెట్టేసినా తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం నేరుగా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసినట్లుగా ఉంది. జగన్ బొమ్మ వల్ల తాను గెలవలేదని, తన వల్లే నరసాపురంలో ఎంపిగా వైసిపి గెలిచిందని చెప్పటమే విచిత్రంగా ఉంది. పైగా తనను వైసిపి నేతలే కాళ్ళా వేళ్ళా పడి బతిమలాడుకుంటేనే తాను పార్టీలో చేరినట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి మొన్నటి ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన చాలామంది జగన్ వల్లే గెలిచారనటంలో సందేహం లేదు. ఇదే విషయం కృష్ణంరాజుకు కూడా వర్తిస్తుంది.

 

ఎందుకంటే కృష్ణంరాజుకు నరసాపురంలో పోటి చేసేందుకు మొన్నటి ఎన్నికల్లో టిడిపి టిక్కెట్ ప్రకటించింది. అయితే టికెట్ ప్రకటించిన తర్వాతే కృష్ణంరాజు హఠాత్తుగా వైసిపిలో చేరాడు. టిక్కెట్ ఇచ్చిన టిడిపి నుండి వైసిపిలోకి రాజు ఎందుకు చేరాడు ? ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో టిడిపి గెలవదనే విషయం బాగా అర్ధమైపోయింది. అందుకనే చివరినిముషంలో టిక్కెట్ ఇచ్చిన పార్టీని కాదనుకుని జగన్ దగ్గరకు ఎందుకు చేరాడో ముందు చెప్పాలి. అలాగే వైసిపిలో చేరమని తనకు బ్రతిమలాడుకున్నదెవరో కూడా రాజు ముందు చెప్పాలి.

 

అదే సమయంలో ఇక్కడ ఓ విషయం గమనించాలి. అదేమిటంటే 2014 ఎన్నికల్లో నరసాపురం నుండి వైసిపి అభ్యర్ధిగా  పోటి చేసి ఓడిపోయిన వంకా రవీంద్రనాధ్ కు 4.54 లక్షల ఓట్లొచ్చాయి. అదే మొన్నటి ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా గెలిచిన కృష్ణంరాజుకు 4.42 లక్షల ఓట్లు. నిజంగానే కృష్ణంరాజు సొంత ఇమేజితోనే గెలిచుంటే చాలా నియోజకవర్గాల్లో ఎంపి అభ్యర్ధులకు వచ్చినట్లు లక్షల్లో ఎందుకు మెజారిటి రాలేదు ? ముక్కి మూలిగి కృష్ణంరాజు గెలిచింది సుమారు  30 వేల మెజారిటితో మాత్రమే అని మరచిపోయినట్లున్నాడు. వైసిపి అభ్యర్ధిగా పోటి చేశాడు కాబట్టే కృష్ణంరాజు గెలిచాడనటంలో ఎటువంటి సందేహం లేదు.

 

కృష్ణంరాజు గెలిపులో జనసేన అభ్యర్ధి నాగుబాబు కూడా పెద్ద పాత్రే ఉంది. ఎలాగంటే మూడోస్ధానంలో సరిపెట్టుకున్న నాగుబాబుకు 2.48 లక్షల ఓట్లొచ్చాయి. నాగుబాబు గనుక మరికొన్ని ఓట్లు తెచ్చుకునుంటే కృష్ణంరాజు ఓడిపోయేవాడేనేమో.  నాగుబాబుకు వచ్చిన ఓట్లలో అత్యధికం టిడిపి ఓట్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాగుబాబు టిడిపి ఓట్లు చీల్చుకోవటంతోనే టిడిపి అభ్యర్ధికి కూడా దెబ్బపడింది. వాస్తవం ఇలాగుంటే కృష్ణంరాజు మాత్రం ఉల్టాగా మాడ్లుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. అన్నీ తెలిసి కూడా ఎంపి అడ్డంగా  మాట్లాడుతున్నాడంటే హిడెన్ అజెండా ఏదో ఉండే ఉంటుందనటంలో సందేహం లేదు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: