ప్రతి గొడవా మొదట్లో చాలా చిన్నదిగానే  మొదలవుతుంది. అప్పుడే గనుక దానికి సీల్ వేయకపోతే పెరిగి చాటంతై చివరకు చాపంతవుతుందనటంలో సందేహం లేదు. ప్రస్తుతం క్షేత్రస్ధాయిలో అధికారపార్టీలో మొదలైన వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం మొదలైంది. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు కేంద్రంగా మొదలైన చిన్న వివాదం రోజు రోజుకు పెరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే రోజు ముందు ఎంపి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారింది. ఎంపి మాట్లాడిన మాటలు ఎలాగున్నాయంటే జగన్ కెపాసిటినే ఛాలెంజ్ చేసేట్లుగా ఉంది.

 

ఎలాగూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎంఎల్ఏలందరూ ఒకేచోట చేరుతున్నారు కదా. అందుకనే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని  ఎంఎల్ఏలతో పాటు మంత్రులు కూడా ఒక్కసారిగా కృష్ణంరాజుపై దండయాత్ర మొదలుపెట్టారు.  ఇటునుండి మంత్రులు ఎంఎల్ఏలు చేసిన వ్యాఖ్యలకు అటునుండి ఎంపి కూడా రియాక్టయ్యాడు. మొత్తానికి మంత్రులు, ఎంఎల్ఏలందరూ కలిసి ఎంపిని దమ్ముంటే రాజీనామా చేయమంటూ సవాలు చేసే స్ధాయికి వివాదం చేరుకుంది. ఎంఎల్ఏ కొట్టు సత్యనారాయణ గురించి ఎంపి మాట్లాడుతూ ఇసుక—అంటూ బహిరంగంగానే ఆరోపించాడు. ఇసుక మాఫియాకు ఎంఎల్ఏనే నాయకుడంటూ ఎంపి ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు.

 

ఇక్కడ అందరికీ అర్ధమవుతున్నదేమంటే వైసిపిలో ఎంపి ఉండదలచుకోలేదని. అయితే పార్టీలో నుండి బయటకు పోవాలంటే మార్గమేంటి ? వైసిపి తరపున గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళటానికి కృష్ణంరాజు ఎందుకో మొహమాట పడుతున్నట్లున్నాడు. అందుకనే పార్టీపై నోటికొచ్చినట్లు మాట్లాడితే, ఏకంగా జగన్ పైనే వ్యాఖ్యలు చేస్తే పార్టీ తనను సస్పెండ్ చేస్తుందని అనుకుని ఉంటాడు ఎంపి. ఒకసారి పార్టీ సస్పెండ్ చేస్తే తర్వాత కృష్ణంరాజు స్వతంత్రుడైపోతాడు. అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడి జగన్ను రెచ్చగొట్టి సస్పెన్షన్ వేటు వేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

 

అదే సమయంలో ఎంపిని రాజీనామా చేసి మళ్ళో పోటి చేసి గెలవమని మంత్రులు, ఎంఎల్ఏలు రెచ్చగొడుతున్నారు. ఎంపి ఏమన్నా పిచ్చోడా రెచ్చగొట్టగానే రెచ్చిపోయి రాజీనామా చేసేయటానికి. ఒకసారి ఎంపి పదవికి రాజీనామా చేస్తే తన భవిష్యత్తేమిటో తెలుసుకోలేని అమాయకుడు కాదు కదా.  ఎంపితో పాటు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే కృష్ణంరాజు మొన్నటి ఎన్నికల్లో వైసిపి తరపున పోటి చేశాడు కాబట్టే గెలిచాడని.  సరే గెలుపోటములను పక్కనపెట్టేస్తే నరసాపురం ఎంపి కేంద్రంగా మొదలైన వివాదం చివరకు రోడ్డుకెక్కింది. ఫలితంగా మీరు రాజీనామా చేయాలంటే మీరే రాజీనామా చేయాలంటూ ఎంపి, ఎంఎల్ఏలు చాలెంజులు చేసుకుంటున్నారు.

 

ఇపుడు గనుక జగన్ జోక్యం చేసుకుని వెంటనే పరిస్ధితిని చక్కదిద్దకపోతే ముందు ముందు పరిస్ధితి మరిన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ప్రతి జిల్లాలోను ఎవరో ఒక ఎంపినో లేకపోతే ఎంఎల్ఏనో ఏదో కారణంతో అసంతృప్తితో ఉండటం సహజం. ఎలాగూ కృష్ణంరాజు వ్యవహారం రోడ్డుమీద పడింది కాబట్టి వెంటనే దీన్ని అదుపు చేయటంపై జగన్ దృష్టి పెట్టాలి. లేకపోతే కృష్ణంరాజు లాంటి వాళ్ళు మిగిలిన జిల్లాల్లో కూడా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి జగన్ ఈ సమస్యను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: