చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కు కొత్త చిక్కులు రాబోతున్నాయా..? ఆయన రాజకీయ భవిష్యత్తును చేతులారా ఆయనే నాశనం చేసుకుంటున్నారా..? అంటే.. రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తుంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009, 2014లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన చింతమ‌నేని అన్నీ తానే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మరింత రెచ్చిపోయారు. ఆయనపై ఎన్నో ఆరోపణలు, కేసులు కూడా ఉన్నాయి. ఆఖరికి త‌న వ్య‌వ‌హారాల‌ను ప్ర‌శ్నించిన అధికారుల‌పై కూడా ఆయ‌న దాడులు చేయించార‌నే కేసులు ఉన్నాయి.

 

అలాగే ప్ర‌తిప‌క్షంపైనా, స్థానికంగా అధికారుల‌పైనా ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి. కులం పేరు పెట్టి దూషించడం, ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం ఇవన్నీ 2019లో ఆయన ఓటమికి కారణలే. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ ప్ర‌భుత్వం రాగానే చింత‌మ‌నేనిపై ఫోకస్ పెట్టింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో చింతమనేనిపై చాలా కేసులు పెట్టారు.. దీంతో ఒకానొక ద‌శ‌లో 60 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. ఒక కేసులో కోర్టు బెయిల్ ఇస్తే.. మ‌రో కేసులో అరెస్టులు సాగాయి. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌క్తిగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ లోపం కార‌ణంగా ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని విశ్లేషకుల భావన.

 

అయితే తాజాగా టీడీపీ నేత‌, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు విష‌యంలో చింత‌మ‌నేని స్పందించారు. వాస్త‌వానికి పార్టీ త‌ర‌ఫున చాలా మంది నాయ‌కులు ఈ విష‌యంపై స్పందించారు. అచ్చెన్న‌ను అరెస్టు చేయ‌డాన్ని అంద‌రూ త‌ప్పుబ‌ట్టారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. అయితే, వీరంద‌రికీ భిన్నంగా.. చింత‌మ‌నేని కారులో నేరుగా రోడ్డు మీద‌కి వ‌చ్చి.. కొవిడ్ రూల్స్‌ కు భిన్నంగా నిర‌స‌న‌కు దిగారు. దీంతో పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేసి జైలు కు త‌ర‌లించారు.

 

ఒక రోజు అనంతరం బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే అధికార వైసీపీపై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు చింత‌మ‌నేని విషయంలో సంచ‌ల‌న నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది. పాత కేసుల‌ను తిర‌గ‌దోడుతూ.. చింత‌మ‌నేనిపై రౌడీ షీటు ఓపెన్ చేసేందుకు జిల్లా ఎస్పీ ప‌రిశీలించేలా ఆదేశాలు జారీ చేసిన‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇది జరిగితే మాత్రం చింతమనేనికి జీవితంలో కోలుకోలేని దెబ్బతగలడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మరి ఇప్పటికే చింతమనేని మారతారో లేదు చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: