కుక్క‌తోక ప‌ట్టుకుని ఏడాదంతా ఉతికినా వంక‌రే అన్న‌చందంగా...చైనాకు ఎన్ని మంచి మాట‌లు చెప్పినా చెవికెక్క‌డం లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ భార‌త్‌తో క‌య్యానికే సై అంటోంది. గిల్లిక‌జ్జాల‌కు దిగుతోంది. నోటివెంట శాంతి ప్ర‌వ‌చ‌న‌లు చేస్తూనే నొస‌లుతో క‌య్యానికే రెడీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. మంచు కొండల్లో భారత్‌ తనపై వ్యూహాత్మకంగా పైచేయి సాధించకుండా ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నాల‌ను చైనా చేస్తూనే ఉంది. ఉత్తరాన అక్సాయ్‌చిన్‌ నుంచి దిగువన ప్యాంగాంగ్‌ నది వరకు కూడా మొత్తం తనదేనని వాదిస్తోంది. ఈ నెల 15న గాల్వన్‌ లోయలో చై నా దుస్సాహసం కూడా ఈ కోవలోనిదే అయినా.. దాని అసలు ఎత్తుగడ మాత్రం వేరే ఉంది.

 

 లేహ్‌-దౌలత్‌ బేగ్‌ ఓల్డీ రోడ్డు, దీని నుంచి శ్యోక్‌-గాల్వన్‌ నదుల సంగమ ప్రాంతానికి భారత్‌ నిర్మించిన వంతెన.. భారత్‌కు ఎంతో కీలకమైంద‌ని చెప్పాలి. అటు పాకిస్థాన్‌, ఇటు చైనాను నిలువరించేందుకు ఇవి భార‌త్‌కు ఎంతో కీల‌క‌మైన  వ్యూహాత్మకమైన కీల‌క మార్గాలుగా చెప్ప‌వ‌చ్చు. భార‌త్‌కు దెబ్బ కొట్టాలంటే ఈ ప్రాంతాన్ని క‌బ్జా చేయ‌డం ఎంతైనా అవ‌స‌ర‌మ‌ని గ్ర‌హించిన చైనా  ఈ ప్రాంతం మొత్తాన్నీ హ‌స్త‌గ‌తం చేసుకునేందుకు కుయుక్తుల‌తో అడుగులు వేస్తోంది. ఎల్‌ఏసీ పేరిట తరచూ పెడుతున్న పేచీల పరమార్థమిదేన‌ని భార‌త ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతున్నారు.  తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికుల కదలికలను పరిశీలిస్తే దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, డెప్‌సాంగ్‌ సెక్టార్లలో తాజాగా వివాదాలు లేవనెత్తే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు. 

 

ఈక్ర‌మంలోనే  దౌలత్‌ బేగ్‌ ఓల్డీకి తూర్పు ప్రాంతంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సైన్యం చురుకుగా కదులుతోందని, ఆ ప్రాంతంలో క్యాంపులు ఏర్పాటు కావడమే కాకుండా.. వాహనాల కదలికలు కూడా ఎక్కువయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.చైనా కదలికలకు అనుగుణంగా భారత్‌ మే నెల చివరిలోనే డెప్‌సాంగ్‌ ప్రాంతానికి తన బలగాలను తరలించిందని సమాచారం. 2013లో చైనా ఇదే డెప్‌సాంగ్‌ ప్రాంతంలో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. 2016 ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ సైనిక స్థావరం వద్దనే ఈ క్యాంపులు ఏర్పాటు కావడం గమనార్హం. ఈ నెలలో తీసిన కొన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కొత్త క్యాంపుల గురించి తెలియగా.. స్థానిక నిఘా వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: