అవును! జాతీయ రాజ‌కీయాల్లో అస‌లు పాలిటిక్స్ ఇప్పుడే మొద‌ల‌య్యాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక మాదిరిగా ఉన్న పాలిటిక్స్ ఇప్పుడు ఊపందుకున్నాయి. అవి కూడా క‌క్ష‌పూరిత పంథాలోనే ముందుకు సాగుతున్నాయ‌నేది విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇస్తున్న విష‌యం. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు.. కానీ, అధికారం కోసం.. పీఠాల‌ను శాశ్వ‌తం చేసుకోవ‌డం కోసం.. రాజ‌కీయ నేత‌లు నేడు అడ్డ‌దారులు తొక్కేందు కు ఏమాత్రం చింతించ‌డం లేదు. ``రాజ‌కీయం చాలా బ‌ల‌మైంది. వ్య‌వ‌స్థ‌ను బాగు చేయ‌డం.. పాడు చే య‌డం రెండూ దీనికి తెలుసు!``- అంటారు మ‌హాత్మాగాంధీ. నేడు ఆయ‌న చెప్పిన ప్ర‌తి అక్ష‌రం స‌త్య‌మే అవుతోంది. 

 

రాష్ట్రాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై అధికారంలో ఉన్న వారు కేసులు పెడుతుంటే.. అమ్మో.. అయ్యో.. క‌క్ష పూరిత రాజ కీయాలు అని గొంతు చించుకుంటున్నారు. రాజ‌కీయ దురుద్దేశంతోనే ఇలా దాడులు చేస్తున్నారు అని దెప్పిపొడుస్తున్నారు. కానీ, ఇప్పుడు కేంద్రంలోనూ రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకున్నారు. క‌క్ష పూరిత‌, కేసుల పూరిత రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వెలుగు చూశాయి. కేంద్రం గురించి మాట్లాడుకునే ముందు.. ఒక్క‌సారి రాష్ట్రంలో ప‌రిణామాల‌పై చ‌ర్చిద్దాం.. రాష్ట్రంలో అవినీతి కేసులో 151 కోట్ల దోపిడీ ఆరోప‌ణ‌ల‌పై మాజీ మంత్రి టీడీపీ నేత‌, టెక్క‌లి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట‌యి.. జైలుకు వెళ్లారు. ఇక‌, మ‌రో మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర ఏకంగా హ‌త్య కేసులో ప్రోద్బ‌లం అందించార‌నే ఆరోప‌ణ‌ల‌తో ఊచ‌లు లెక్కిస్తున్నారు. 

 

ఇక‌, జ‌నాల ప్రాణాలతోనే ఆట‌లాడుకునేందుకు ప్ర‌య‌త్నించార‌ని, న‌కిలీ స‌ర్టిఫికెట్లు పుట్టించి.. బీఎస్‌-3 వాహ‌నాల‌ను గుట్టుగా అమ్ముకున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిని పోలీసు లు అరెస్టు చేశారు. దీంతో ఆయా ఘ‌ట‌న‌ల‌పై టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌లు క‌న్నీళ్లు పెట్టుకున్నాయి. ``ఇంద తా రాజ‌కీయ ప్ర‌తీకారం, క‌క్ష‌, మేం రాసుకుంటున్నాం.. వ‌డ్డీతో స‌హా తీరుస్తాం..`` అంటూ టీడీపీ నేత‌లు రోడ్డెక్కారు. వీరికి అటు ఇటుగా బీజేపీ నేత క‌న్నా.. జ‌న‌సేన నాయ‌కుడు.. ప‌వ‌న్ కూడా గొంతుక‌లిపారు. నిజంగానే వీరి ఆరోప‌ణ‌లు చూసిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో ఏదో జ‌రిగిపోతోంద‌నే అనుకున్న‌వారు కూడా లేక‌పోలేదు. అయితే, ఇప్పుడు కేంద్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇక్క‌డి బాబు ప‌వ‌న్‌, క‌న్నాల‌కు నోరు పెగ‌ల‌డం క‌ష్ట‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు. 

 

ఇటీవ‌ల చైనా-భార‌త్ స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని, చైనా మ‌న భూభాగంలోకి చొచ్చుకురాలేద‌ని అంటున్న ప్ర‌ధాని మోడీ వ్యాఖ్య‌ల్లో ప‌స‌లేద‌ని కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. అంతేకాదు, ఒక వేళ మోడీ.. క‌నుక త‌న వ్యాఖ్య‌లే నిజ‌మ‌ని అంటే.. 23 మంది మ‌న సైనికులు ఎందుకు వీర‌మ‌ర‌ణం చెందారో చెప్పాలంటూ.. నిల‌దీశారు. క‌ట్ చేస్తే.. దీనికి స‌మాధానం.. నేరుగా రాలేదు.. వేరే రూపంలో వ‌చ్చింది. చైనాతో కాంగ్రెస్ పాల‌కులు కుమ్మ‌క్క‌య్యార‌ని, ఏకంగా చైనా దౌత్య కార్యాల‌యం నుంచి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాజీవ్‌గాంధీ ఫౌండేష‌న్‌(ఆర్‌జీ ఎఫ్‌)కు అక్ర‌మ మార్గంలో నిధులు అందాయ‌ని బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి ర‌విశంకర ప్ర‌సాద్ ఎదురు దాడి చేశారు. 

 

వాస్త‌వానికి ఎవ‌రైనా దీనిని ఏమ‌నుకుంటారు?  రాజ‌కీయంగా రెండు పార్టీలు చేసుకుంటున్న మాట‌ల దాడి అనుకోరా? అంతే!  సింపుల్. రాజ‌కీయాల్లో ఉన్నారు కాబ‌ట్టి.. ఒక‌రిపై ఒకరు విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు స‌హ‌జం అనుకుంటారు. కానీ, బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి చేసిన ఆరోప‌ణ‌లు ఆధారంగా కేంద్రంలోని న‌రేం ద్ర మోడీ స‌ర్కారు కేవ‌లం 15 రోజుల్లోనే..  కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని మూడుస్వ‌చ్ఛంద సంస్థ‌లపై ఈడీ విచార‌ణ‌కు ఆదేశించింది. అంతేకాదు.. ఈ విచార‌ణ‌ను స‌మ‌న్వ‌యం చేసేందుకు ఓ మంత్రి వ‌ర్గ క‌మిటీని కూడా నియ‌మించేసింది. రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్‌, రాజీవ్‌గాంధీ చారిట‌బుల్ ట్ర‌స్ట్‌, ఇందిరాగాంధీ మెమోరియ‌ల్ ట్ర‌స్టుల‌పై ఈడీ స‌హా.. మంత్రి వ‌ర్గ క‌మిటీలు డేగ‌క‌న్ను సారించ‌నున్నాయి. 

 

నిజానికి ఈ విచార‌ణ‌ల‌కు సంబందించి పెద్ద‌గా ఆధారాలు ఏవీలేవు.. కానీ, మోడీ మాత్రం త‌న‌ను ప్ర‌శ్నించిన రాహుల్‌కు బుద్ధి చెప్పాల‌నే ఉద్దేశంతోనే రాజ‌కీయ ప్ర‌తీకారేచ్ఛ‌తోనే ఈ విచార‌ణ‌ల‌కు ఆదేశించార‌నేది నిర్వివాదాంశం. మ‌రి అక్క‌డ ఇది న్యాయ‌మైన‌ప్పుడు.. ఏపీ విష‌యంలో నిజంగానే ఇలా జ‌రిగినా..(వాస్త‌వానికి ఇలాంటిది లేదు)  బీజేపీకి మ‌ద్ద‌తిచ్చే బాబుకు కానీ, ప‌వ‌న్‌కు కానీ, బీజేపీ చీఫ్ క‌న్నాకు కానీ.. ప్ర‌శ్నించేందుకు ఛాన్స్ ఎక్క‌డ‌?  ఒక వేళ ప్ర‌శ్నించినా.. ఏ మొహం పెట్టుకుంటారు? ఇప్పుడు ఇదీ.,. కేంద్రంలో జ‌రుగుతున్న అస‌లైన స్టోరీ.. ఇప్పుడే మొద‌లైంది.. ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: