ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూర‌మై మూడు ద‌శాబ్దాలు దాటుతోంది. అయినా ఆ పార్టీ అక్క‌డ పాతుకుపోవ‌డానికి, తిరిగి పూర్వ‌వైభ‌వం పొంద‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. సోనియా, రాహుల్‌,ప్రియాంకా గాంధీతో పాటు ప‌లువురు అగ్ర‌నేత‌లు ఆ రాష్ట్ర రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఓ క‌న్ను వేసి ఉంచుతూ ప్ర‌తిస్పందిస్తూనే ఉంటారు. కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న ఆ రాష్ట్రం త‌ర్వాత కాలంలో ఎస్పీ చేతుల్లోకి, ఆ త‌ర్వాత బీఎస్పీ, ఇప్పుడు బీజేపీ చేతిలోకి మారిపోయింది. గ‌డిచిన మూడు ద‌శాబ్దాల్లో కాంగ్రెస్ క‌నీసం ప్ర‌తిప‌క్షంగా కూడా ఉండ‌టం లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీకి స‌హాయ హోదాలో పాత్ర‌ను పోషిస్తూ వ‌స్తోంది. అయితే 2022 ఎన్నిక‌ల్లో యూపీలో అధికారాన్ని కైవసం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా తాజాగా అధినేత్రి సోనియా వ్యూహంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.


కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి రోజురోజుకు దేశ వ్యాప్తంగా దిగ‌జారుతూ ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరుకున్న ప‌రిస్థితుల్లో కొంత‌కాలంగా సోనియ‌గా ఆక్టివ్‌గా ఉంటున్నారు. రాజ‌కీయాల‌కు దాదాపు దూర‌మ‌య్యార‌నే అనుకుంటున్న స‌మ‌యంలో తిరిగి పార్టీ అధినేత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక లాక్‌డౌన్ మొద‌లైన నాటి నుంచి సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీ ఎన్డీఏ విధానాల‌పై విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి తీసుకువ‌చ్చిన విధానంపై తూర్పారా బ‌ట్టారు. వ‌ల‌స కార్మికుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని గొంతుకు వినిపించారు. వాస్త‌వానికి  ఈ విష‌యంలో కాంగ్రెస్ వ్యూహం కొత్త ఫ‌లించింద‌నే చెప్పాలి.


వ‌ల‌స కార్మికుల‌కు అండ‌గా నిలిచింద‌నే భావ‌న ఇప్పుడు ఆ వ‌ర్గంలోఉండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా యూపీలో 2022లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప్రియాంక గాంధీని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ముందుగానే ప్ర‌క‌టించి..అక్క‌డ పార్టీకి జ‌వ‌స‌త్వాలు తీసుకురావాల‌ని సోనియా యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో ప్రియాంకా అధికారిక గృహాన్ని ఖాళీ చేయించిన స‌మ‌యంలోనే నేరుగా ఆమె ల‌క్నో చేరుకుంటార‌నే వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఆమె మార్చిలోనే ల‌క్నోకు మ‌కాం మారుస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. క‌రోనాతో ఆగిపోయిన‌ట్లుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. యోగీ ఆదిత్యనాథ్ ప్ర‌భుత్వం దారుణంగా వైఫ‌ల్యం చెందింద‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ప్రియాంకాగాంధీ రాష్ట్రంలోకి ప్ర‌వేశిస్తే కాంగ్రెస్‌కు క‌ల‌సివ‌స్తుంద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: