కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్లాస్మా థెరఫికి ఆశించిన ఫలితాలు రావటంతో ఈ చికిత్స విధానానికి ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. చాలా రాష్ట్రాల్లో వైద్యులు ఇప్పుడు ప్లాస్మా థెరఫీకే మొగ్గుచూపుతున్నారు. ఢిల్లీలో ఏప్రిల్ నెలలోనే తొలిసారి ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే.  వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండి.. అక్క‌డ‌ వెంటిలేటర్‌పై ఉన్న ఓ 49ఏళ్ల వ్యక్తికి ప్లాస్మా చికిత్స చేశారు. దీంతో ఈ చికిత్స విధానంపై న‌మ్మ‌కం బ‌ల‌ప‌డ‌టంతో దేశ వ్యాప్తంగా అత్య‌వ‌స‌ర‌మైన వారికి ప్లాస్మా థెర‌పీని కొన‌సాగిస్తున్నారు. ఇప్పటికే వైరస్ బారినపడి కోలుకున్నవారు తమ ప్లాస్మాను దానం చేయాల్సి ఉంటుంది. ఇలా దానం చేసిన వారి ప్లాస్మాను థెర‌పీలో వినియోగిస్తారు.

 

  ఢిల్లీలో ప్లాస్మాను స్వ‌చ్ఛందంగా దానం చేసేందుకు ఢిల్లీ, ముంబైలాంటి మ‌హాన‌గ‌రాల్లోని ప్ర‌జ‌లు ముందుకు వ‌స్తున్నారు. అక్క‌డి ప్ర‌భుత్వాలు కూడా ఇప్ప‌టికే ప్లాస్మా బ్యాంకుల‌ను ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. క‌రోనా నుంచి కోలుకున్న వారిలో అవ‌గాహ‌న పెంపొందించడంలో ప్ర‌భుత్వాలు కూడా విజ‌య‌వంత‌మ‌య్య‌య‌నే చెప్పాలి. ఇక మిగ‌తా రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే అంత‌గా ప్లాస్మాపై అవ‌గాహ‌న పెర‌గ‌లేదు.అయితే కొంత‌మంది మాత్రం ప్లాస్మా దందాను మొద‌లెట్టేశారు. ఇందుకు కొన్ని ఆస్ప‌త్రులు, అందులోని వైద్యులు కార‌కుల‌వుతున్నారు. మ‌నిషి ప్రాణం నిల‌బెట్టే అవ‌స‌రాన్ని ఆస‌రాగా చేసుకుని కాసుల‌కు క‌క్కుర్తి ప‌డి నీచ‌పు దందాకు దిగుతున్నారు. 

 

అవ‌స‌రాన్ని బ‌ట్టి వేలు, ల‌క్ష‌లు ఆస్ప‌త్రుల్లోని మెడిక‌ల్ దందాగాళ్లు గుంజేస్తున్నారు. అయితే ఇలా గుంజేస్తున్న దాంట్లో వాస్త‌వానికి డోన‌ర్లుకు ముడుతున్న‌ది కూడా చాలా త‌క్కువేన‌ట‌. ల‌క్ష‌లు వ‌సూలు చేసుకుని ప్లాస్మా దానం చేసిన వారికి మాత్రం ఐదు నుంచి ప‌దివేలు చేతిలో పెట్టేస్తున్న‌ట్లు స‌మాచారం. త‌మ జేబుల్లో మాత్రం ల‌క్ష‌లు కుక్కేసుకుంటున్నార‌ని తెలుస్తోంది.ఈ దందాను ఆదిలోనే ఆపే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాల‌ను డిమాండ్ చేస్తున్నారు. ఇలా దందా జ‌రుగుతున్నీ నీడ‌లు ఇప్పుడు హైద‌రాబాద్‌లోనే అధికంగా ఉంటున్నాయ‌ని ఒక‌ట్రెండు సంఘ‌ట‌న‌ల ద్వారా తెలుస్తోంది. రెడ్‌క్రాస్ వంటి స్వ‌చ్ఛంద సంస్థ‌ల నేతృత్వంలో ప్లాస్మా బ్యాంకుల ఏర్పాటుకు ప్ర‌భుత్వం పూనుకుంటే మంచి ఫ‌లితాలుంటాయ‌ని ప్ర‌జ‌లు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: