ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి దెబ్బకి ఒక్కసారిగా స్తంభించిపోయింది. అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలం అయిపోయాయి. ఈ మహమ్మారి బారిన ఇప్పటికే కోటి మందికి పైగా పడగా.. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కూడా దీని వ్యాప్తి తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా ముంబై లాంటి మహానగరాల్లో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల ప్రాంతాలలో ముంబై లోని ధారవి కూడా ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. ఆసియా ఖండంలో గరిష్ట జనసాంద్రత గలిగిన అతి పెద్దదైన ధారవి మురికివాడలో 10 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. మరి అలాంటి ధారవిలో కరోనా అడుగుపెడితే.. జరగబోయే నష్టాన్ని ఊహించుకుంటేనే భయమేస్తుంది. కానీ, కరోనా అడుగు ధారవిలో పడిపోయింది. అయితే నష్టం మాత్రం ఊహించినంత స్థాయిలో జరగలేదు.

 

మొదటి సారిగా 01 ఏప్రిల్ 2020 రోజున 19 కరోనా కేసులు బయట పడ్డాయి. మే 2020 వరకు 1216 కేసులు నమోదుకాగా, 56 మంది మరణించారు. జూన్ మాసంలో రోజుకు సగటున 18 కేసులు బయట పడ్డాయి. 10 జూలై వరకు 2359 కేసులు నమోదుకాగా, 215 మంది చనిపోగా 1952 రికవరీలు జరిగాయి. కరోనా సోకిన వారి సమీప బంధువులు 58,154 మందిని గుర్తించిన వెంటనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రపంచ మరియు దేశ కరోనా గణాంకాలతో పోల్చితే ధారవిలో కరోనా కేసుల వ్యాప్తి రేటు తగ్గుట ఆశ్చర్యాన్నే కాక ఆనందాన్ని కలిగిస్తున్నది. బ్రహన ముంబాయి మునిసిపల్ కార్పొరేషన్ అంచనాలకు వ్యతిరేకంగా విశ్వ మహమ్మారిని కట్టడి చేయడంలో ధారవి ప్రజలు కూడా ఇటలీ, స్పెయిన్ మరియు దక్షిణ కొరియాల వలె కట్టుదిట్టమైన చర్యలతో కట్టడి చేయ గలిగారని డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది.

 

ధారవి మురికివాడ ప్రజలు చూపిన క్రమశిక్షణ, పట్టుదల మరియు పాటించిన నియమ నిబంధనలు ప్రశంసనీయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సెక్రటరీ జనరల్ డా: టెడీస్ అధనోమ్ ప్రకటించడం హర్షదాయకం. వాస్తవానికి అత్యధిక జనసాంద్రత ఉండడం వల్ల సామాజిక దూరం పాటించడం కష్టమని, హెం క్వారంటైన్ సాధ్యం కాదని ప్రభుత్వం భావించి భయపడింది. ధారవిలో 80 శాతం ప్రజలు 450 కమ్యూనిటీ టాయిలెట్లు వాడడం, ఎక్కువ మంది బయటి ఆహా రాన్ని తీసుకోవడం, అతి సన్నని గల్లీలు ఉండడం వంటి కారణాలతో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుందని భావించారు. బ్రహన్ ముంబాయి మునిసిపల్ కార్పొరేషన్ వారు ధారవి ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 47,500 గృహాలకు వైద్యసదుపాయాలు కల్పిస్తూ,

 

మొబైల్ వ్యాన్ల ద్వారా 14,970 మందికి పరీక్షలు చేశారు. 3.6 లక్షల మందికి పరీక్షలు చేస్తూ, 8,246 మంది వృద్ధులను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ధారవి మురికివాడలో 13,500 పరీక్షలు చేస్తూనే, ప్రజలందరికి ప్రతి రోజు భోజన వసతులు కల్పించారు. ఇరుకైన గదుల లో జీవించే ప్రజలకు క్వారంటైన్ కేంద్రాలుగా పాఠశాలలు, ఫంక్షన్ హాల్స్, క్రీడా వనరులు ఎంపిక చేశారు. ప్రజలకు అల్పా హారం, రెండు పూటల భోజనాలను అందరికి అందించారు. వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మందులు, 24 గంటల వైద్య సదుపాయాలు కల్పించారు. కరోనాను కట్టడి చేయడంలో ధారవి మురికివాడ ప్రజలు చూపిన క్రమశిక్షణ మరియు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య వైద్య సదుపాయాలు దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికే మర్గదర్శణం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: