కరోనా టెస్టుల చేయడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఈ విషయంలో ఎన్నో రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం. దీంతో సీఎం జగన్ ను జాతీయ నేతల నుంచి సాదారణ ప్రజల దాక ఎందరో అభినందిస్తున్నారు. పక్కనున్న తెలంగాణలోని ప్రతిపక్షాలు కూడా సీఎం కేసీఆర్ ని ఇదేవిధంగా చేయమని డిమాండ్ చేస్తున్నాయి. సరే ఈ విషయంలో సీఎం జగన్ భేష్ అనుకుందాం.. మరి ఇన్ని టెస్టులు చేస్తున్నప్పటికీ ఏపీలో కరోనాని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు. వాస్తవానికి కరోనా వ్యాప్తి తగ్గాలంటే టెస్టు చేస్తే సరిపోదు. కేవలం ఉందో లేదో తెలియడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. మరి ఏం చేయాలి..? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది..? ఇప్పుడు చూద్దాం.

 

టెస్టుకు నమూనాలు తీసుకున్న క్షణం నుంచి ఆ వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేయాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఆస్పత్రికి తరలించాలి.. లేదా, ఇంట్లో సదుపాయం ఉండి ఎక్కువ గదులున్న ఇల్లు అయితే హెంక్వారంటైన్లో పెట్టి వారిని పర్యవేక్షించాలి.  పాజిటివ్ అని తేలిన వెంటనే ఆ వ్యక్తిని గత 10 రోజుల్లో కలిసిన వారి వివరాలు సేకరించి వారికి టెస్టులు చేయాలి. మరి ఏపీలో ఏం చేస్తున్నారు.? టెస్టులకు నమూనాలు సేకరిస్తున్నారు. కానీ, వాటిలో 2 లక్షల శాంపిళ్ళు అత్యంత నిర్లక్షంగా వృథా అయ్యాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 35 వేల శాంపిల్స్ వేస్టు అయ్యాయి.. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ముమ్మాటికి నిర్లక్ష్యమే.

 

అలాగే పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స లేదు పర్యవేక్షణ లేదు. తాజాగా జరిగిన ఒక అమానుష ఘటనే ఇందుకు నిదర్శనం. జగ్గయ్యపేటకు చెందిన వృద్ధురాలికి (65) కరోనా టెస్టు చేస్తే పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను 108లో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. కానీ, బెడ్ లు ఖాళీగా లేవు ఇంటికి వెళ్లిపో అని అన్నారు ఆస్పత్రి సిబ్బంది. చేసేదేమి లేక ఆ రోజు రాత్రంతా ఆస్పత్రి వరండాలోనే పడుకుంది ఆ వృద్ధురాలు. కనీసం ఆమెను ఎవరూ పట్టించుకోలేదు, తిండి కూడా పెట్టలేదు. మరుసటి రోజు ఉదయాన్నే బస్సులు మొదలయ్యాక బస్టాండుకు వెళ్లి బస్సెక్కి జగ్గయ్య పేట వెళ్లింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. అసలు ఆస్పత్రికి వచ్చిన ఆమెను తిరిగి ఎలా పంపిస్తారు.? సరే పంపించారు. అయితే 108లో ఆస్పత్రికి వచ్చిన ఆమెను.. మళ్ళీ తిరిగి అదే వాహనంలో పంపాలి.

 

కానీ, అలా జరగలేదు. ఆమె బస్సు ఎక్కడంతో.. ఆ బస్సులో ప్రయాణించిన చాలా మందికి వైరస్ సోకే అవకాశం ఉంది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ ఘటనపై అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. అలాగే 50 ఇళ్లకు ఒక వాలంటీరు ఉండి కరోనా పై డేగ కన్ను వేస్తే ఈ వ్యవహారాన్ని మొత్తం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వలంటీర్ ఏమయ్యాడు.? అతనితో పాటు ఉండే ఆశ కార్యకర్తలు ఏమయ్యారు.? అసలు అధికార యంత్రాంగం ఏమైపోయింది..? ఇలా ఎవరికి వారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టే ఏపీలో కరోనా కంట్రోల్ అవ్వట్లేదు. కేవలం టెస్టులు చేస్తే సరిపోదు. కట్టడి చేయడంపై కూడా దృష్టి పెట్టాలి. ఇకనైనా ప్రభుత్వం మేలుకుంటే మంచిది.. లేదంటే ఈ మహమ్మారి కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: