ఆరు ద‌శాబ్దాల సుదీర్ఘ స్వప్నం సాకార‌మైన రోజు.. చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి అప్పుడే ఐదు వ‌సంతాలైంది. అమరుల బలిదానాల్లో ఆరిపోయిన ప్రాణాలు, కష్టాల నడుమ గాయాల నడుమ వొడితిరుగుతున్న కడుపుకోతలు, లక్షల గొంతులు చించుకోని ఎగిసిపడ్డ నినాదాలు, బిగుసుకున్న పిడికిల్లు, కుట్రల్ని కుటిలాల్ని ఎప్పటికప్పుడు ఎదిరించిన వ్యూహాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, అక్షరాలు, ఆటపాటలు, కోటి ఆరాటాలు ఒక్కటై ఒక ఆధిపత్యాన్ని గెలిచినాయి. 
Image result for telangana movement
గమ్యాన్ని ముద్దాడిన వేళ తెలంగాణ గుండె ఉద్వేగంతో ఎగిసిప‌డిన‌ది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించిన ఉద్యమం తెలంగాణ ఉద్యమమొక్కటే. ఇది మన కాలపు చరిత్ర, మన కండ్ల ముందటి విజయం. తెలంగాణ ప్ర‌జ‌ల కండ్ల‌ల్ల వెలుగునిండింది. ఇది ప్రజా చరిత్రాత్మకమైన విజయం. 
 
సంబూరం త‌ర్వాత ఇప్పుడు వికాసం వైపు అడుగులు పడవలసి ఉన్నది. స్థానిక వనరులు, సహజ సంపదలు ఇక్కడి ప్రజల బ‌తుకుల్లో పచ్చదనం నిలిపేందుకే వినియోగించాలి. విజయం తర్వాత సవాళ్ళు సహజమే. వివిధ అస్తిత్వాలు, వివిధ సమూహాలు తమ సందేహాలు వెలిబుచ్చడం తప్పనిసరి. వైరుధ్యాలుంటాయి. సంఘర్షణలుంటాయి. వాటన్నింటిని సవ్యంగా పరిష్కరించగలగాలె. అన్ని సమూహాల పరస్పర అవగాహన సాధించగలగాలె. అందరి ఆలోచనలు తెలంగాణను బంగారు తునకగా మార్చుకునే దిశగా కార్యరూపం దాల్చవలసిన స‌మ‌యం ఇది.

Related image

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మనం ఎంత బలమైన పునాది వేయగలిగితే రాబోయే తరతరాల వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుందన్నది వాస్త‌వం. ప్రజలకు పారదర్శకంగా, న్యాయబద్ధంగా సుపరిపాలన అందించే దిశగా నిర్ణయాలు జ‌ర‌గాలె.
తెలంగాణ ఉద్యమం అస్తిత్వ చైతన్యఫలం. వికాసం కూడా అస్తిత్వ పునాదుల మీదనే జరగాలె. అభివృద్ధి ప్రజాజీవితంతో అనుసంధానమవుతూ కొనసాగాలె. సాగుతున్న తెలంగాణ నిర్మాణానికి రాజకీయ అస్తిత్వం, సాంస్కృతిక అస్తిత్వం రెండూ కీలకమైన పార్వ్శాలు. అవి బలంగా నిర్మాణమయినప్పుడే తెలంగాణ అస్తిత్వం పరిఢవిల్లుతది. ఆ ఎరుకతోనే రాష్ట్ర‌ ప్ర‌జ‌లు క‌ల‌లుగ‌న్న స‌రికొత్త తెలంగాణ అవతరిస్తది. అప్పుడే తెలంగాణ ప్ర‌జ‌ల కండ్ల‌ల్ల‌ వెలుగు నిండుత‌ది. 
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి ఐదు వ‌సంతాలు అయిన సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.   

Image result for telangana image


మరింత సమాచారం తెలుసుకోండి: