కవ్వాల్ అభయారణ్యంలోకి పెద్ద పిల్లలు క్ర‌మంగా వ‌ల‌స వ‌స్తున్నాయి. మ‌హారాష్ట్ర అడ‌వుల‌కు ఆనుకుని ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పులులకు ఆవాసం గా మారింది. ఇప్పటికే కవ్వాల్ లో ఆరు పెద్ద పులులు ఉండగా తాజాగా మరో మూడు పులులు ఉన్న‌ట్లుగా అట‌వీశాఖ అధికారులు గుర్తించారు. ఇటీవ‌ల‌ శ్రీరాంపూర్ ఆర్కె బొగ్గు గ‌ని సమీపంలో మ‌గ పులి సంచ‌రిస్తున్నట్లు గుర్తించిన విష‌యం తెలిసిందే. గ‌నికి స‌మీపంలో పులి విహ‌రిస్తుండ‌గా సింగ‌రేణి బొగ్గు గ‌ని కార్మికులు వీడియోను కెమెరాలో బంధించారు. విష‌యం తెలుసుకున్న అట‌వీ అధికారులు పులి ఆకారాన్ని బ‌ట్టి అది మ‌గ‌పులిగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. 

 

ఇదిలా ఉండ‌గా మ‌రో మూడు పులులు కూడా కొత్త‌గా అడ‌విలోకి ప్ర‌వేశించిన‌ట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.  నిర్మల్ఆ, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీమ్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో 2020 కిలోమీటర్లలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉన్నది. ఇందులో 895 చ‌ద‌ర‌పు కిలోమీటర్ల‌లో కోర్ ఫార‌స్ట్‌గా ఉంది. ఈ ప్రాంతంలో పెద్ద‌పులుల సంర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వం టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్ జోన్‌గా ఏర్పాటు చేసింది. పులుల సంర‌క్ష‌ణ‌కు కావాల్సిన ఏర్పాట్ల‌ను చేస్తోంది. గ‌త కొంత‌కాలంగా  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంరక్షణ చర్యల కారణంగా కవ్వాల్ లో పెద్ద పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ ఆరు పెద్ద పులులు ఉండగా వీరిలో ఆడ మగ పులుల‌తో పాటు 4 పిల్ల పులులు ఉన్నాయి.

 

 తాజాగా మరో మూడు వ‌చ్చి చేరిన‌ట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా మీదుగా క‌వ్వాల్ అడ‌వుల్లోకి ప్ర‌వేశించిన పులి జాడ తెలియ‌రావ‌డం లేదు. ఆసిఫాబాద్ జిల్లా మీదుగా 25 రోజుల క్రితం వ‌చ్చి ఉంటుంద‌ని అధికారులు పేర్కొంటున్నారు.  పులులు సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టింది. బేస్ క్యాంపు వాచర్ తో నలుగురు సభ్యులున్న 23 బృందాలను ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా కొత్త‌గా పులుల సంచారం పెర‌గ‌డంతో అట‌వీ స‌మీప గ్రామాల్లోకి ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే వాటి జోలికి వెళ్ల‌నంత వ‌ర‌కు మ‌న‌కు హాని త‌ల‌పెట్ట‌వ‌ని అధికారులు భ‌రోసా ఇస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: