ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో దక్షిణ ఢిల్లీలో విశాలమైన టెంట్ కింద తాత్కాలికంగా వెయ్యి పడకల కరోనా ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు.  ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం కేటాయించిన ఆస్ప‌త్రుల‌న్ని కూడా నిండిపోయాయి. ప్ర‌స్తుతం ఢిల్లీల్లో ప‌రిస్థితి భయాన‌కంగా త‌యారైంది. ఢిల్లీ హర్యానా సరిహద్దులో రాధా సోమి సత్సంగ్ బియాస్ అనే ఆధ్యాత్మిక సంస్థ ఆవరణలో ఈ ఆస్పత్రిని ఈ నెలాఖరులో ఏర్పాటు చేస్తారు. 1700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పు గల స్థలంలో ఒక్కొక్క విభాగంలో 50 పడకలు వంతున మొత్తం 200 విభాగాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఢిల్లీ ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారు. 

 

రోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌ను చేప‌డుతున్న‌ట‌లు చెప్పారు.  లైట్లు, ఫ్యాన్లు, కూలర్లు తదితర సౌకర్యాలన్నీ ఉంటాయ‌ని వెల్ల‌డించారు.జూన్‌ నెలాఖరు వరకు దవాఖాన నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నారు.ఇదిలా ఉండ‌గా కరోనా వైరస్ పేషెంట్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని.. ఓ మృతదేహాన్ని చెత్త కుప్పలో పడేయడం ఇందుకు నిదర్శనమని సుప్రీం కోర్టు ఇటీవ‌ల తీవ్రంగా ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుప‌ట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుండ‌టంతో ఢిల్లీ ప్ర‌భుత్వం త‌ల ప‌ట్టుకుంటోంది. ఏం చేయాలో అర్థం కాక ఆగ‌మాగ‌మ‌వుతోంది. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ కోవిడ్-19 ఆస్పత్రిలో.. వార్డుల్లోనే కాదు.. లాబీల్లోనూ కరోనా మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. 

 

 సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే.. ఎల్‌జేఎన్‌పీ ఆస్పత్రిలో తమవాళ్ల మృతదేహాలు తారుమారుయ్యాయని రెండు కుటుంబాలు ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. ఆస్పత్రిలో సరైన చికిత్స అందించకపోవడమే కాదు... ఆఖరికి తమవాళ్ల మృతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేకపోయామని వాపోయారు. ఢిల్లీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రంగంలోకి దిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈనెల 15న ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌తో హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కానుండ‌టంతో ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఢిల్లీలో క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఈ భేటీలో చ‌ర్చ‌కు రానున్న‌ట్లు స‌మాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: