క‌రోనా వైర‌స్ గుప్పిట దేశ రాజ‌ధాని ఢిల్లీ, ఆర్థిక రాజ‌ధాని ముంబై చిక్కుకుని విల‌విలాడుతున్నాయి. రెండు న‌గ‌రాలు ఇప్ప‌ట్లో ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేలా లేవు. ఢిల్లీ, ముంబై ప్రాంతాల‌ను వ‌దిలి వెళ్తున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ట్లు ప‌లు స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. ముంబైలో రోజురోజుకు ప‌రిస్థితి దిగ‌జారుతోంది. ప్ర‌భుత్వం ఎంత క‌ఠినంగా నియ‌మాలు అమ‌లు చేస్తున్నా..వ్యాప్తి త‌గ్గ‌క‌పోగా గ‌తంలో క‌న్నా పెర‌గ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో దేశం మొత్తంలో జ‌రుగుతున్న మ‌ర‌ణాల్లో ఈ ప్రాంతానిదే అగ్ర‌స్థానం. ఆ త‌ర్వాత ఢిల్లీ, గుజ‌రాత్‌లున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో 2,137 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఒకే రోజు ఈ స్థాయిలో కరోనా కేసులు రావడం ఇదే మొదటి సారి.

 

 తాజా కేసులతో దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య 36 వేలకు చేరుకోగా... ఈ వైరస్ కారణంగా 1,214 మంది చనిపోయారు. అలాగే కరోనా వైరస్‌ ఉక్కు పిడికిలిలో చిక్కుకొని మహారాష్ట్ర విలవిలలాడుతోంది. ముంబైలో 50 వేలు కేసులు నమోదు కావడానికి 77 రోజుల సమయం తీసుకుంటే మరో 50 వేల కేసులు కేవలం 19 రోజుల్లో దాటాయంటే వైరస్‌ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందో అర్థం చేసుకోవచ్చు. దుబాయ్‌ నుంచి వచ్చిన పుణే జంటకు మార్చి 9న తొలి కోవిడ్‌–19 కేసు ముంబైలో న‌మోదైంది. గ‌త 96 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కేసులు దాటేయ‌డం గ‌మ‌నార్హం.  ప్రపంచంలోనే అత్యధిక కేసులు న‌మోదైన ప్రాంతాల్లో ముంబైకి 17వ స్థానం ద‌క్కింది. చైనా, కెనడా వంటి దేశాలను కూడా క‌రోనా కేసుల్లో ముంబై దాటేయ‌డం గ‌మ‌నార్హం.


ఇదిలా ఉండ‌గా దేశంలో ఇంతవరకూ కరోనా సామూహిక వ్యాప్తి జరగడం లేదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చి జూన్‌ 11న ప్రకటించింది. తాము జరిపిన సర్వే ప్రకారం ఇప్పటి వరకూ 0.73 శాతం ప్రజలకు మాత్రమే వైరస్‌ సోకిందని, మరణాల రేటు 0.08 శాతం మాత్రమే ఉందని వెల్ల‌డించింది. దీనినిబట్టి ప్రభుత్వం కోవిడ్‌-19ని కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ విజయవంతం అయ్యాయని భావించాల్సి ఉంటుంద‌ని ఉన్న‌తాధికారులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: