దేశం మొత్తంలో 3ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదు కాగా ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే ల‌క్ష కేసులు న‌మోద‌వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారుతోంది. ప్ర‌జ‌ల‌ను క‌రోనా బారి నుంచి కాపాడే క్ర‌మంలో వైద్యులు, పోలీసులు,పారామెడిక‌ల్ సిబ్బంది, ప్ర‌భుత్వ యంత్రాంగంలోని ఉద్యోగులు, చివ‌రికి పాల‌కులు కూడా క‌రోనా కాటుకు గురవుతున్నారు. చాలా మంది ఇటీవ‌ల ప్రాణాల‌ను కూడా వ‌దిలారు. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే మ‌హారాష్ట్ర‌లో మ‌ర‌ణాల రేటు హెచ్చుస్థాయిలో ఉండ‌బోతోంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. మొత్తంగా కరోనా వైరస్‌ ఉక్కు పిడికిలిలో చిక్కుకొని మహారాష్ట్ర విలవిలలాడుతోంది.

 


దుబాయ్‌ నుంచి వచ్చిన పుణే జంటకు మార్చి 9న కోవిడ్‌–19 సోకిన దగ్గర్నుంచి 96 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కేసులు దాటేశాయి. మహారాష్ట్ర కనుక ఒక దేశమే అయి ఉంటే, వరల్డో మీటర్‌ ప్రకారం ప్రపంచంలో అత్యధిక కేసుల్లో 17వ స్థానంలో ఉన్న‌ట్లు లెక్కించాల్సి ఉండేద‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వాస్త‌వానికి క‌రోనా వైర‌స్ పుట్టినిల్ల‌యినా చైనా దేశం కంటే ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే అధికంగా కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి మ‌హారాష్ట్ర‌లో 50 వేలు కేసులు నమోదు కావడానికి 77 రోజుల సమయం  ప‌డితే ... మ‌రో 50 వేల కేసులు న‌మోదు కావడానికి కేవ‌లం 19 రోజులు మాత్ర‌మే ప‌ట్ట‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న అంశం. అయితే మ‌రో ల‌క్ష కేసులు ప‌ట్ట‌డానికి వారం రోజుల‌కు మించ‌క‌పోవ‌చ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. 

 

క‌రోనా వైర‌స్ ఉధృతి అధికంగా మారిన నేప‌థ్యంలో ఇక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ళ్లీపూర్తి లాక్‌డౌన్‌ను అమ‌ల్లోకి తీసుకువ‌చ్చే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈమేర‌కు సోమ‌వారం ఇందుకు సంబంధించిన ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మ‌హారాష్ట్ర‌లో శ‌నివారం సాయంత్రం నాటికి 1,01,141 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ  పేర్కొంది.  ఒక్క ముంబై న‌గ‌రంలోనే 55,451 కేసులు  ఉన్నాయి. ముంబై తర్వాత థానే,  పుణే ప‌ట్ట‌ణాల్లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: