దేశ వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తున్న వేళ రిక‌వ‌రీ కేసుల సంఖ్య కూడా పెరుగుతుండ‌టం ఆశాజ‌న‌క‌మైన విష‌యంగా చెప్పాలి. గ‌త కొంత‌కాలంగా రోజుకు 10వేల‌కు పైగా దేశ వ్యాప్తంగా కేసులు న‌మోద‌వుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 3ల‌క్ష‌ల‌కు పైగా న‌మోద‌య్యాయి. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే ల‌క్ష కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన వివ‌రాల ప్ర‌కారం కేసుల పెరుగుదలతో పాటు వైరస్‌ సోకి చికిత్స అనంతరం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యేవారి శాతం కూడా పెరుగుతోంది. ఆదివారం కరోనా వైరస్‌ రికవరీ రేటు 50 శాతం దాటిందని కేంద్ర ప్రభుత్వం వెల్ల‌డించింది.  

 

ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 50.60 శాతం మంది కోలుకున్నారని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,929 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోదైన‌ట్లు వెల్ల‌డించింది.  ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,49,348 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,62,378 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి ఆరోగ్య‌వంతులుగా మారి ఇంటికి వెళ్లిన‌ట్లు కేంద్రం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌ల ద్వారా తెలుస్తోంది.  ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 9,195 మంది కరోనా వైరస్‌ బారినపడి మృతి చెందారు. మొత్తం కేసుల న‌మోదులో మ‌హారాష్ట్ర ప్ర‌థ‌మ స్థానంలోఉండ‌గా ఆ త‌ర్వాత‌, ఢిల్లీ, గుజ‌రాత్ రాష్ట్రాలున్నాయి.  ఢిల్లీలో క‌రోనాను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు అక్క‌డి యంత్రాంగం విశ్వ ప్ర‌య‌త్నం చేస్తోంది. 


ఇందులో భాగంగానే  ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో పెంచుతున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ చెప్పిన విష‌యం తెలిసిందే. ఆస్పత్రుల్లో బెడ్ల కొరతను నివారించాడానికి 500 రైల్వే కోచ్‌లను కరోనా బాధితులకు కేటాయిస్తామన్న విషయం తెలిసిందే.ముంబైలో రోజురోజుకు ప‌రిస్థితి దిగ‌జారుతోంది. ప్ర‌భుత్వం ఎంత క‌ఠినంగా నియ‌మాలు అమ‌లు చేస్తున్నా..వ్యాప్తి త‌గ్గ‌క‌పోగా గ‌తంలో క‌న్నా పెర‌గ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో దేశం మొత్తంలో జ‌రుగుతున్న మ‌ర‌ణాల్లో ఈ ప్రాంతానిదే అగ్ర‌స్థానం. ఆ త‌ర్వాత ఢిల్లీ, గుజ‌రాత్‌లున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో 2,137 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఒకే రోజు ఈ స్థాయిలో కరోనా కేసులు రావడం ఇదే మొదటి సారి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: