పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ హిస్టరీ టీచర్ అయితే మా పరిస్థితి ఏంటి అని ట్వీట్‌ చేసినా.. కాశ్మీర్‌ అంశంపై విభిన్నంగా స్పందించినా ఆయనకే చెల్లింది. సోషల్‌ మీడియా వేదికగా ఆయన చేసే ట్వీట్లకు ఎంతో మంది ఫిదా అవుతారు. ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాయి. కష్టపడేతత్వం ఉన్న వాళ్లని ఆయన ట్వీట్‌తో ప్రపంచానికి దగ్గర చేస్తారు. ఆయన ఎవరో కాదు.. దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా. 


ఆనంద్ మహీంద్రా.. ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు ఇది. మహీంద్రా గ్రూప్ చైర్మన్. దేశవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఉన్నా... తన సత్తాతో, తెలివితేటలతో నష్టాల్లో ఉన్న కంపెనీనైనా లాభాల బాట పట్టించగల మొనగాడు. సోషల్‌ మీడియాలో ఆనంద్‌ మహీంద్రా చేసే ట్వీట్స్‌కి లక్షల్లో అభిమానుల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడూ సోషల్‌ మీడియాలో సమకాలీన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది.


ప్రస్తుతం ఆయన రీట్వీట్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆఖరి నిమిషం వరకు పోరాడితే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ వీడియో ద్వారా అర్థమవుతుందని మహీంద్రా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన వీడియో ఓ కబడ్డీ మ్యాచ్ కు చెందినది. కూతకు వెళ్లిన ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్టు ఆటగాడ్ని అవుట్ చేసి లైన్ వద్దకు చేరుకుంటాడు. అయితే తన కోర్టులోకి వెళ్లకుండా ఇంకా అక్కడే ఉండి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొడతాడు. ఇంతలో అవుటైన ఆటగాడు అక్కడికి వచ్చి కవ్విస్తున్న ఆ రైడర్ ను ఒక్కసారిగా తమ కోర్టు లోపలికి లాగడంతో అందరూ వచ్చి మూకుమ్మడిగా అతడ్ని పట్టుకోవడం వీడియోలో చూడొచ్చు.ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా, ప్రొకబడ్డీ లీగ్ లో కూడా ఇలాంటి సీన్ చూడలేదని కామెంట్ చేశారు.


ఇలాంటి వీడియోలే కాదు.. ఆయన చేసిన ట్వీట్లు నవ్వులు తెప్పిస్తాయి. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ జర్మనీ, జపాన్‌ రెండూ సరిహద్దు దేశాలని ఓ సారి ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ చూసిన ఆనంద్‌.. ఇమ్రాన్‌ మాకు హిస్టరీ టీచర్‌ అయ్యింటే మా పరిస్థితి ఏంటని ట్వీట్ చేశారు. దీనికర్ధం.. జపాన్‌, జర్మనీ రెండు సరిహద్దు దేశాలు కాదు.. ఓ దేశ ప్రధాని ఇలా ప్రపంచ మ్యాప్‌పై అవగాహన లేకుండా చేసిన ట్వీట్‌కి ఆయన శైలిలో ఓ కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చాడు. అప్పుట్లో ఈ ట్వీట్‌ ఓ సెన్సేషన్‌గా మారింది. 


ప్రపంచంలో తల్లి ప్రేమ విలువకట్టలేనిది.. ఆమె రుణం తీర్చుకోవడం కుమారులకు, కూతుళ్లకు సాధ్యం కాదు.. తీర్చుకునే సందర్భం వస్తే అంతకుమించిన సదావకాశం ఇంకొకటి ఉండదు. అలాంటి అవకాశమే ఓ కుమారుడికి దక్కింది. తన తల్లి కోరిక మేరకు ఆ కుమారుడు బ్యాంకు ఉద్యోగం మానేసి.. దేశంలోని ఆలయాలన్నింటిని తన మాతృమూర్తికి చూపించాడు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా చెంతకు చేరింది. అంతే.. తల్లిపై కుమారుడు చూపించిన ప్రేమకు ఆయన ఫిదా అయ్యారు. స్కూటర్‌పై దేశమంతా తిప్పుతున్నాడని ఆశ్చర్యపోయి తనవంతుగా ఆయనకు ఓ కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఓ కారును గిఫ్ట్‌గా ఇస్తానని సందేశం పంపాడు. తల్లీకుమారుడి తదుపరి పర్యటనలు ఆ కారులో సాగేందుకు వీలవుతుందని తన దాతృత్వాన్ని చాటారు ఆనంద్‌ మహీంద్రా.


అదే విధంగా రూపాయికే ఇడ్లీ అందిస్తున్న తమిళనాడుకు చెందిన ఓ బామ్మగారికి కార్పోరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా వంట గ్యాస్ ఉచితంగా అందిస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆమెకు గ్యాస్‌కు అయ్యేంత ఖర్చునే మహీంద్రానే భరించాడు. ఇలా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన దాతృత్వాన్ని చాటుకోవడమే కాకుండా.. సమకాలీన అంశాలపై తనదైన శైలిలో ట్వీట్స్‌ చేస్తూ ది గ్రేట్‌ ఆనంద్‌ మహీంద్రా అన్పించుకుంటున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: