ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠంగా వేళ్లూనుకున్న నేటి భారతంలో ఎమర్జెన్సీ ఓ దుస్సాహసం. ప్ర‌ధానమంత్రి  హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయ‌కురాలు ఇందిరాగాంధీ ఈ సంచ‌ల‌న, వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు. ఎమర్జెన్సీని విధించిన స‌మ‌యంలో దాన్ని ఎదిరించి పోరాడిన తెలుగు వారిలో ఓ ప్ర‌ముఖురాలు స్నేహలతారెడ్డి.  1925లో జన్మించిన స్నేహలత  స్నేహగా.. స్నేహలతగా సుపరిచితం. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె నర్తకిగా ఖ్యాతి గడించారు. నటిగా ప్రశంసలందుకున్నారు. పౌర హక్కుల ఉద్యమంలో ఒక కార్యకర్తగా భాగమయ్యారు. 

 

భారతదేశంలో క్రైస్తవ మతానికి మారిన రెండో తరంలోని మ‌హిళ అయిన స్నేహలత గురించి ఆమె కుమార్తె నందనారెడ్డి ఇటీవ‌ల ఓ వ్యాసం రాశారు.  తన తల్లి ప్రాణాలను ఎమర్జెన్సీ ఎలా బలితీసుకుందో అందులో వివరించారు. నెల్లూరుకు చెందిన ఓ సంపన్న భూస్వామి కుమారుడు తిక్కవరపు పఠాభి రామరెడ్డి తొలి చూపులోనే మా త‌ల్లిని ప్రేమించాడు. వీరిద్ద‌రూ కుటుంబాల‌ను వ్య‌తిరేకించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అని వివ‌రించారు. ఇద్దరివీ సోషలిస్టు భావాలు. రామ్ మనోహర్ లోహియాకు సన్నిహితులు. 1975 జూన్ 25వ తేదీన అర్థరాత్రి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించగా దానికి వ్యతిరేకంగా జార్జిఫెర్నాండెజ్‌ తదితరులతో స్నేహలత సన్నిహితంగా పనిచేశారని నంద‌నా రెడ్డి గుర్తు చేశారు. ‘‘నా తల్లిదండ్రులు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ గళం విప్పారు. ఇందిరాగాంధీ నిరంకుశత్వాన్ని వ్యతిరేకించే వారిని కూడగట్టడానికి రంగంలోకి దిగారు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయటం వల్ల ప్రమాదాలను వివరిస్తూ కరపత్రాలు రాశారు. తమ అసమ్మతిని తెలియజేయటానికి నాటకం, సినిమా వంటి అన్ని వేదికలనూ ఉపయోగించుకున్నారు. ’’ అని నందనారెడ్డి ఆనాటి సంద‌ర్భాల‌ను వివ‌రించారు. 

 

1976 మే 2వ తేదీన త‌న త‌ల్లి స్నేహలతను అరెస్ట్ చేయ‌గా...అద్వాణీ, వాజపేయి, రామకృష్ణ హెగ్డే, దేవెగౌడ వంటి చాలా మంది అగ్రనాయకులున్న బెంగళూరులోని సెంట్రల్ జైలులో త‌న త‌ల్లి సైతం జైలు జీవితం అనుభ‌వించార‌ని నంద‌నా వివ‌రించారు. ఈ సమ‌యంలో స్నేహలత నిర్బంధంలోనూ ధిక్కార స్వరం వినిపించారు. ఈ సంద‌ర్భంగా ఆమె రాసిన డైరీలో వాఖ్యాలు ఎంతో స్ఫూర్తిని నింపాయ‌ని వివ‌రించారు. ``ఒక మహిళను వేధించటం ద్వారా మీకు కేవలం వికృత ఆనందం లభిస్తుంది. అనవసరమైన ఈ వేధింపులతో మీరు సాధించేదేమిటి? మీ గౌరవం దిగజారుతుందంతే.’’ అని స్నేహలత జైలులో ఉండగా రాసిన డైరీలో పేర్కొన్నారు. ఎన్నో అంశాల‌ను పేర్కొంటూ... స్నేహలత జైలులో రాసిన డైరీని అనంతర కాలంలో ‘ఎ ప్రిజన్ డైరీ’ పేరుతో ప్రచురించారు. కాగా, స్నేహలత ఆరోగ్య పరిస్థితి విషమించటంతో 1976 డిసెంబర్ 13వ తేదీన ఆమెను పెరోల్ మీద విడుదల చేశారు. అయితే,  కొద్ది రోజులకే 1977 జనవరి 20వ తేదీన ఆమె క‌న్నుమూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: