ప్రస్తుత రోజుల్లో హోటల్‌లో ఉండాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పనో అందరికి తెలిసిందే. ఒక్క రాత్రికే వేలు వేలు వసూళ్లు చేస్తున్నారు. కొన్ని లాడ్జీలు అందుబాటు ధరలకే గదులు ఇచ్చినా సదుపాయాలు మాత్రం అంతగా ఉండవు. అయితే, జపాన్‌లోని ఓ హోటల్ లో అన్ని సదుపాయాలతో, అతి తక్కువ ధరకు గదిని అద్దెకిస్తామని ప్రకటించింది. కానీ, ఇందులో ఓ తిరకాసు ఉంది. గది తాళాలు అందుకోడానికి ముందు.. వారు పెట్టిన షరతుకు ఒప్పుకోవాలి

ఈ హోటల్ గదిలో అడుగుపెట్టే కస్టమర్లు తమ ప్రైవసీ గురించి మరిచిపోవాలి. అంటే.. ఆ గదిలో నా ఇష్టం వచ్చినట్లు ఉంటా అంటే కుదరదు. ఎందుకంటే.. ఆ గదిలో జరిగే ప్రతి విషయం హోటల్ సిబ్బందికి తెలిసిపోతుంది. కేవలం హోటల్ వారికే కాదు.. ప్రజలకు కూడా తెలిసిపోతుంది. అదెలా అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ గదిలో సీసీటీవీ కెమేరాలు ఉన్నాయి. అవి రికార్డు చేసే వీడియోలు One Dollar Hotel అనే ‘య్యూట్యూబ్’ చానెల్‌లో లైవ్‌లో ప్రసారం అవుతుంది. అంటే, ఆ గదిలో ఉండే వ్యక్తులను మీరు కూడా లైవ్‌లో చూడవచ్చు.

గదుల్లో లైంగిక చర్యల నివారణ నిమిత్తం ఆ హోటల్ యజమాని ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన హోటల్ గదిలోకి వెళ్లే వ్యక్తి నగ్నంగా తిరగడం, సెక్స్ తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదనేది ప్రధాన నియమం. ఆ గదిలో కేవలం వీడియో మాత్రమే రికార్డు అవుతుంది. వారి మాటలు రికార్డు కావు. అందువల్ల ఆ గదిలో వ్యక్తులు ఏం మాట్లాడుకున్నా బయటకు వినిపించవు. అయితే, ఆ గదిలో ఉన్నప్పుడు వ్యక్తిగత వివరాలేవీ బయటకు తెలియకుండా జాగ్రత్తపడాలని, కెమేరాల ముందు క్రెడిట్, డెబిట్ తదితర కార్డులేవీ చూపించవద్దని హెచ్చరిస్తారు.

ఈ హోటల్ గదిలో ఉండటమంటే ‘బిగ్‌బాస్’ హౌస్‌లో ఉన్నట్లే. అయితే, ఈ బిగ్‌బాస్ టాస్కులు ఇవ్వడు, మాట్లాడడు. కానీ, గదిలో జరిగేదంతా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా 24X7 యూట్యూబ్‌లో ప్రసారం చేస్తూనే ఉంటాడు. ఆ గదిలో అతిథులు లేనప్పుడు.. ఆ హోటల్ యజమాని తన గదిలోని వీడియోను లైవ్‌‌లో ప్రసారం చేస్తూ టచ్‌లో ఉంటాడు. అది సరే.. కనీసం బాత్రూమ్‌లోనైనా నగ్నంగా ఉండవచ్చా? అనే కదా మీ డౌట్. అందులో మీకు ఎలాంటి అభ్యంతరం అక్కర్లేదు. అక్కడ కెమేరాలేవీ ఏర్పాటు చేయలేదు. ‘బిజినెస్ ర్యోకాన్ ఆశాహీ’ అనే ఈ హోటల్ ఫుకౌకా నగరంలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: