ప్రతి ఏటా కొత్త సంవత్సరపు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా ప్రజలు జరుపుకుంటారు. మన భారతదేశంలో కూడా ప్రముఖ నగరాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్లు తారా స్థాయిలో ఉంటాయి. అయితే వారం రోజుల్లో మనమందరం 2019కి వీడ్కోలు చెప్పి 2020ను ఘనంగా స్వాగతించబోతున్నాం.


అయితే, ప్రతి నూతన సంవత్సర వేడుకలను ఒక్కో దేశం ఒక్కో రకమైన ఆచారంతో జరుపుకుంటాయి. ఏ దేశాల్లో ఏ విధమైన ఆచారాలతో న్యూ ఇయర్ జరుపుకోబోతున్నారో ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకోబోతున్నాం.


ఇటలీ దేశంలోని ప్రజలు నూతన సంవత్సర సందర్భంగా... పాత వస్తువులని తమ ఇంటి కిటికీలో నుంచి బయటకు పడవేసి కొత్త వస్తువులను ఇంటికి తెచ్చుకొని న్యూ ఇయర్ జరుపుకుంటారు. అలా ఎందుకు చేస్తారంటే గడిచిపోయిన సంవత్సరంలోని బాధలను పోగొట్టాలనే ఉద్దేశంతో ఇంట్లో పనికిరాని పాత వస్తువులను బయట పడేస్తుంటారు.


జపాన్ దేశ ప్రజలు.. నూతన సంవత్సర వేడుకలని ఎలా జరుపుకుంటారు అంటే.. జనవరి 1వ తారీఖున కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చి.. పగలబడి నవ్వుతారు. అలా నవ్వడం వలన వారిని అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం.


వెనిజులా లోని ప్రజలు మాత్రం పసుపు రంగు ఇన్నర్ వేర్ లని ధరిస్తారు. అలా పసుపు లోదుస్తులను ధరించడం వలన వారిని అదృష్టం వరిస్తుందని ఆ ప్రజల నమ్మకం. అదేవిధంగా వారి కోరికలను ఒక పేపర్ పై రాసి.. వాటిని మంటల్లో వేసి కాల్చి వేస్తారు.


ఫ్రాన్స్ దేశస్థులు.. నూతన సంవత్సర సందర్భంగా బాణాసంచా కాల్చుతూ పెద్ద పెద్ద ధ్వనులను చేస్తుంటారు. ఇలా చేయడం వలన చెడు ఆత్మలు పారిపోతాయని వారి నమ్మకం. అందుకే న్యూ ఇయర్ నైట్ వేడుకలు ఫ్రాన్స్లో సూపర్ గా జరుగుతాయి. అలాగే ఫ్రెంచ్ ప్రజలు నూతన సంవత్సరం ప్రారంభం అవ్వగానే ఎవరు మొదటిగా తమ ఇంట్లో అడుగు పెడతారో.. వారి స్వభావాన్ని బట్టి తమ సంవత్సరకాల జీవితం ఆధారపడి ఉంటుందని భావిస్తుంటారు.


ఫిలిప్పీన్స్ ప్రజలు తమ పిల్లలను న్యూ ఇయర్ నైట్ పది సార్లు ఎగిరమని చెబుతారు. అలా చేస్తే తమ పిల్లలు సరైన ఎత్తు పెరుగుతారని వారి నమ్మకం.


డెన్మార్క్ ప్రజలు మాత్రం న్యూ ఇయర్ రోజు తమ పాత వంట సామాగ్రిని స్నేహితుల ఇంటి ముందు ఉన్న నేలకువేసి పగల కొడతారు. ఎవరి ఇంటి ముందు ఎక్కువ ప్లేట్లు పగిలిపోతాయో వారు ఆ సంవత్సరం ఎక్కువ సంతోషంగా ఉంటారని భావిస్తారు డెన్మార్క్ ప్రజలు.


ఇకపోతే, మన దేశ ప్రజలు ఎలా జరుపుకుంటారో మనందరికీ తెలిసిందే. కొత్త బట్టలు వేసుకొని స్వీట్లు పంచుకుంటూ, కేకులు కట్ చేసి కుటుంబ సభ్యులందరితో ఆనందంగా గడుపుతూ మన దేశ ప్రజలు ఈ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: