చాలా మంది బరువు తగ్గేందుకు గంటల కొద్దీ ఎక్సర్ సైజులు చేస్తుంటారు. కష్టమైన డైట్ పాటిస్తారు. కానీ ఫలితం లేదని హైరానా పడిపోతుంటారు. టెన్షన్ కు లోనవుతారు. అసలు బరువు ఎందుకు తగ్గడం లేదో ఆలోచించరు. చిన్న చిన్న లోపాలే అందుకు కారణమని గుర్తిస్తే..  మంచి ఫలితాలుంటాయి. బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు చెప్పిన చిట్కాలు మీ కోసం.

బరువు తగ్గాలనుకునేవారు శరీరం చెప్పే మాటలు కూడా వినాలి. శరీరమేంటి మాట్లాడమేంటని ఆశ్చర్యపోకండి. పక్కా డైట్ పాటిస్తున్న సమయంలో  ఎప్పుడో ఒకసారి కడుపు నిండా భోజనం కావాలని, ఏదైనా స్వీట్ తినాలనుందని శరీరం చెబుతుంది. దానిని తీర్చండి.. లేకపోతే.. ఇవాళ నాకు అలసటగా ఉంది. వర్కవుట్స్ చేసేంత ఓపిక లేదు అని చెబుతుంది. శరీరం మాట వినకపోతే మొదటికే మోసం వస్తుంది.

కొంత మంది ఆకలేస్తే చాలు ఏది పడితే అది ఫుల్ గా లాగించేస్తుంటారు. మరికొంతమంది టీవీ విపరీతంగా చూస్తారు. ఈ రెండు అలవాట్లు చాలా చెడ్డవి. అప్పటివరకు చేసిన వర్కవుట్లన్నీ వృథానే. మితంగా తిన్నా కూడా తినడాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. మరికొంతమంది ఆకలిని చంపుకుంటారు. దీనివల్ల కూడా చెడు జరుగుతుంది. శరీరం నిస్తేజంగా తయారై కసరత్తులు చేసేందుకు సహకరించదు. వీలైనన్ని ఎక్కువసార్లు సలాడ్స్ తీసుకోవడం మంచిది.

బరువు తగ్గే క్రమంలో విశ్రాంతి కూడా ముఖ్యమే. కొంతమంది వర్కవుట్లు ఎక్కువ చేస్తూ నిద్రను పట్టించుకోరు అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. కనీసం ఆరేడు గంటలు నిద్రపోకపోతే.. శరీరం త్వరగా అలసిపోతుంది. ఉత్సాహంగా ఎక్సర్ సైజులు చేయలేరు. ఇక చాలా మంది బరువు తగ్గామా లేదా అని తరచూ చూసుకుంటారు. తగ్గితే ఎగిరి గంతేసి ఎక్సర్ సైజులు చేయడం మానేస్తారు. తగ్గకపోతే ఆందోళన పడిపోయి.. ఎక్కువగా చేస్తారు. ఇలా అతివృష్టి, అనావృష్టి రెండూ నష్టమే. కొంతమంది బరువు తగ్గాలని గంటల కొద్దీ జిమ్ లో గడిపేస్తారు. కానీ కసరత్తులు చేస్తేనే బరువు తగ్గరు అన్న విషయాన్ని గుర్తించరు. 20 శాతం మాత్రమే ఎక్సర్ సైజ్ వల్ల ఉపయోగం, మిగిలిన 80 శాతం ఆహార నియమాలతోనే సాధ్యమన్నది నిపుణుల మాట.

చాలా మంది ముందు జాగ్రత్తగా 8 గంటలకే రాత్రి భోజనం చేసేస్తారు. అర్థరాత్రి 12 గంటల వరకు మేల్కొనే ఉంటారు. దీనివల్ల పడుకునే ముందు ఆకలేస్తుంది. ఏదో ఒకటి తినేస్తారు. అలా కాకుండా వీలైనంత త్వరగా తిని పది గంటలకల్లా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా నియమాలు అన్నీ పక్కాగా పాటిస్తేనే.. చక్కని బాడీ షేప్ సొంతమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: