ఆమె ఓ కెరటం.. కిందపడినప్పుడల్లా పైపైకి లేచింది.. 
పనైపోయిందన్నప్పుడల్లా పసిడి కాంతులు విరజిమ్ముతూనే ఉంది.. 
ఆమె విజేత.. పతకాలనే కాదు.. వివక్షను.. అసమానతలనూ జయించింది..
ఇప్పుడు ప్ర‌త్య‌ర్థుల‌తో పోరాడిన ఆమె ఒక‌ప్పుడు పేద‌రికంతో పోరాడి గెలిచింది..
ఎక్కడో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పుట్టి భారతబాక్సింగ్‌కు మణిహారంలా మారింది..
ఆమె అమ్మ.. పిల్లలను లాలించడమే కాదు.. బాక్సింగ్‌ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది..!

ప్ర‌పంచాన్ని గెల‌వాల‌న్న లక్ష్యం పెట్టుకున్న‌ప్పుడు.. పేద‌రికం అడ్డుకాదు. ఆకాశాన్నంటే విజ‌యం సాధించాల‌నుకుంటే అణువ‌ణువు క‌సి ఉంటే చాలు. ఆర్థిక ప‌రిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేని ప‌రిస్థితుల్లో కూడా అనిత‌ర విజ‌యాన్ని అవ‌లీలా సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించింది క్రీడాకారిణి మేరీకోమ్‌. ఒక‌టి కాదు రెండు కాదు ఆరు ప్రపంచ టైటిళ్లు గెలిచిన తొలి మహిళగా మేరీకోమ్ రికార్డులకెక్కింది. 

Related image 
మేరీకోమ్‌.. ఈ పేరు విన‌గానే ప్ర‌త్య‌ర్థి గుండెల్లో రైళ్లు ప‌రుగెడ‌తాయి. ఆమె కంటికి క‌నిపించ‌గానే ప‌రిస్థితులు తారుమార‌వుతాయి. ఆమె గ్లౌజ్ వేసుకుని పంచ్‌ల‌ వర్షం కురిపించ‌గానే.. ప‌త‌కాలు దాసోహ‌మంటాయి. రింగ్‌లోకి అడుగుపెట్ట‌గానే రికార్డులు ఆమె వెంట న‌డుస్తాయి. ఆరుసార్లు ప్ర‌పంచ చాంపియ‌న్‌.. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్‌ మ‌హిళా బాక్స‌ర్‌గా నిలిచింది ఉమెన్స్ బాక్సింగ్ క్వీన్ మేరికోమ్. పుట్టింది..పెరిగింది మ‌ణిపూర్‌లోని ఓ చిన్న‌గ్రామంలో. తండ్రి తెలియకుండా రహస్యంగా విద్యను అలవరుచుకుంది. పేదరికం ప్రతిభను అడ్డుకోలేదని సాటి చెప్పింది ఈ పతకాల రాణి. మహిళలకు సాధారణం వివాహం తరువాత అందునా పిల్లలు పుట్టిన తరువాత ఫిట్ నెస్ వుండదనీ.. క్రీడల్లో రాణించలేరని అంటుంటారు. అవన్నీ వ‌ట్టి మాట‌లేన‌ని నిరూపించింది మన పతకాల పంచ్ ల రాణి.
 Related image
వయసు పెరుగుతోంది. పైగా ముగ్గురు చిన్నారులకు తల్లి. చిన్న టోర్నీల్లో కూడా పెద్దగా పేరులేని ప్రత్యర్థుల చేతుల్లోనూ ఓడిపోతున్న పరిస్థితులు. మేరీకోమ్ ఈసారి క్రీడల్లో రాణించటం కల్ల అనుకున్నవారి అంచనాలను తల్లక్రిందులు చేస్తు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటకుండా ఆ విమర్శలు అడ్డుకోలేకపోయాయి.. 
 
2016 రియో ఒలింపిక్స్‌కు ఎంపిక కాలేకపోయింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించిన అనంతరం  ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలని మేరీ తపించిపోయింది. కానీ తనకన్నా జూనియర్ల చేతిలో కూడా ఓడిపోవటంతో ఆమె క్రీడా జీవితం ముగిసిపోయిందనుకున్నారంతా. కానీ అంచనాలను తల్లక్రిందులు చేయటం మేరీకి పరిపాటే. ఈ క్రమంలోనే వియత్నాంలో ఆసియా మహిళల ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడం మేరీలో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. ఆ ఉత్సాహంతోనే కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి పసిడి పతకాన్ని అందుకుంది. తాజాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మేరీ అదే జోరు కొనసాగించింది. అంతేకాదు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏడు పతకాలు సాధించిన తొలి బాక్సర్‌గా మరో ఘనత సాధించింది.
Image result for mary kom
మ‌న‌ మణిపూర్ మణిదీపం వయసు 35 ఏళ్లు. ముగ్గురు పిల్లలు. రాజ్యసభ సభ్యురాలు. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ బాక్సింగ్‌లో హిస్ట‌రీ తిర‌గ‌రాస్తూనే వుంది. ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌‌గా అవతరించింది ఈ ముగ్గురు పిల్లల తల్లి. అద్భుత విజయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన ఆమె జీవితాన్ని పరిశీలిస్తే... ప్రతీ పంచ్‌లోనూ కష్టమే... విజయాల్ని ఒడిసిపట్టేందుకు ఆరు అతిపెద్ద సమస్యలను దాటి వచ్చింది.. తానేంటో నిరూపించుకుంది. 
పేద‌రికం నుంచి ప్ర‌పంచాన్ని గెలిచే దాక మేరీకోమ్ క‌ఠోర శ్ర‌మ సినిమాను మించిన సినిమా. ఆకాశాన్నంటే అద్భుత విజ‌యం. అలాంటి మేరీకోమ్ జీవితం ఈ త‌రం యువ‌త‌కు, ప్రతి మహిళకు ఆదర్శం..!


మరింత సమాచారం తెలుసుకోండి: