ఆమె అచ్చ తెలుగు అమ్మాయి. పుట్టింది గుంటూరు జిల్లా. పదహారేళ్ల ప్రాయంలోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తొలి చిత్రం సూపర్ స్టార్ క్రిష్ణ పక్కన చెల్లెలు పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. తరువాత కాలంలో హీరోయిన్ గా ఎదిగి అదే క్రిష్ణ పక్కన జంటగా మెరిసింది. ఇక మెగాస్టార్ చిరంజీవితో ఆమె కాంబో వెండి తెరకు ఓ ముచ్చట. సినిమా వనంలో విరబూసిన ఆ అందం పేరు సుమలత.


సుమలత తాజా ఎన్నికల్లో కర్నాటకలోని మాండ్వా లోక్ సభ సీటు నుంచి ఉద్దండుల మధ్య పోటీలో గెలిచి రికార్డ్ స్రుష్టించారు. భర్త అంబరీష్ మరణం తరువాత ఆమె ఈ సీటు నుంచి పోటీకి దిగి రాజకీయంగానూ రాణించారు. ఇక సుమలత తెలుగులో బాలక్రిష్ణ, మోహన్ బాబులతో పాటు, సీనియర్ హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబుల పక్కన కూడా నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు.


విశ్వనాధ్ శుభలేఖ మూవీ ఆమె నటనకు మచ్చుతునక. అందులో ఆమెకు సరిపడ కళ్ళద్దాల కోసం కళాతపస్వి మద్రాస్ లోని అన్ని షాపులూ వెతికారంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే విశ్వనాధ్ ఆమెను తన స్వయంక్రుషి సినిమాలో కూడా మంచి పాత్ర ఇచ్చి ఉత్తమ నటనను రాబట్టారు. ఇక సుమలత తెలుగులో చేసిన సినిమాల్లో శ్రుతిలయలు గొప్ప సినిమా. అది కూడా కళాతపస్వి మూవీయే. ఈ సినిమాలో సుమలత అత్యుత్తమ నటనను ప్రదర్శించి విమర్శకుల నుంచి కూడా మార్కులు సంపాదించుకున్నారు. 


ఇక చిరంజీవితో ఖైదీ మూవీ ఆమెకు ఓ టర్నింగ్ పాయింట్. అలాగే అగ్నిగుండం మూవీలో రొమాన్స్ పండించిన తీరుకు నాటి యువత జోహార్ అనేసింది. ఆయల శిఖరం, పసివాడి ప్రాణం వంటి అనేక సినిమాల్లో సుమలత మెగాస్టార్ సరసన నటించి మెప్పించింది. ఆగస్ట్ 27 సుమలత పుట్టిన రోజు. ఆమె మరిన్ని విజయాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ.


మరింత సమాచారం తెలుసుకోండి: