దేశంలో ఇప్పటి వరకు బోరోబావిలో ఎంతో మంది చిన్నారులు పడిపోయి తమ ప్రాణాలు కోల్పోయారు.  అతి కొద్ది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. ఓ వైపు ప్రభుత్వం బోరు బావుల విషయంలో నియమనిబంధులు తెలిపినా..చట్టం తీసుకు వచ్చినా కొంత మంది చేసే తప్పిదాల వల్ల చిన్నారులు బలైపోతున్నారు.  ఆ మద్య నయనతార నటించిన ‘కర్తవ్యం’ సినిమా ఇదే అంశంపై తీశారు.  తాజాగా తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టి గ్రామంలో నాలుగు రోజుల క్రితం బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్‌ విన్సెంట్‌ మరణించాడు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బాలుడి మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున వెలికి తీశారు.  80 గంటల పాటు శ్రమించి బోరు బావికి సమాంతరంగా గుంత తవ్వినా బాలుడ్ని రక్షించలేక పోయామని రాథాకృష్ణన్ ఆవేదనగా చెప్పారు.  తమ కొడుకు ప్రాణాలతో బయట పడతాడని భావించిన కుటుంబ సభ్యులకు నిరాశ ఎదురుకావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా సుజిత్‌ విన్సెంట్‌  మరణ వార్త విన్న సెలబ్రెటీలు సైతం తమ సంతాపాన్ని తెలియజేశారు.  చిన్నారి సుజిత్‌ క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు.కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా అతడు క్షేమంగా బయటపడాలని కోరుతూ సందేశాలు పంపారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం బాలుడి అంత్యక్రియలు జరిపారు.

మంత్రులు విజయభాస్కర్‌, నటరాజన్‌, వలార్‌మది, డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు తిరుచ్చిలోని మనపారైకి చేరుకొని బాలుడి మృతదేహానికి నివాళులర్పించారు. త‌మిళ న‌టుడు విశాల్.. సుజిత్ మృతికి సంతాపం తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా గ‌ట్టి చ‌ర్యలు తీసుకోవాల‌ని విశాల్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: