సునీల్ కమెడియన్ అన్న విషయం దాదాపు ఇండస్ట్రీ మొత్తం మర్చిపోతున్నట్టే ఉంది. అతడి కోసం హీరో అవకాశాలు వరుస కడుతున్నారు. చాలామంది ప్రముఖులు అతడితో పని చేసేందుకు ముందుకొస్తున్నారు. దాంతో కన్నుమూసి తెరిచేలోగా బిజీ హీరో అయిపోయాడు సునీల్. నాయకుడిగా మారిన ఈ కామెడీ కింగ్ చేతిలో ప్రస్తుతం ఐదారు సినిమాలు ఉన్నాయి. అయితే ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. అదీ విశేషం. వాటిలో చెప్పుకోదగ్గది భక్త కన్నప్ప చిత్రం. తనికెళ్ల భరణి ఏరికోరి కన్నప్ప పాత్ర కోసం సునీల్ ని తీసుకోవడం మామూలు విషయం కాదు. ఇప్పుడు గోపీ మోహన్ కూడా తన చిత్రానికి సునీల్ నే హీరోగా తీసుకోవడం మరో పెద్ద విశేషం. స్టార్ రైటర్ గోపీమోహన్ దర్శకుడిగా మారాలని చాలా రోజులుగా అనుకుంటూనే ఉన్నారు. ఆయన రచనాశైలి గురించి అందరికీ తెలిసి కాబట్టి, డైరెక్షన్ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో... పలువురు హీరోలు ఆయన సినిమాలో పని చేయడానికి సిద్ధపడుతున్నారు. మొన్నటికి మొన్న రామ్ కూడా గోపీమోహన్ తో పనిచేసేందుకు ఎస్ అన్నాడు. అయితే వారందరినీ వెనక్కి నెట్టి... తన తొలి హీరోగా సునీల్ నే ఎంచుకున్నారు గోపీమోహన్. ఫిబ్రవరిలో సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్తున్నట్టుగా కూడా ప్రకటించేశారు. శ్రీనువైట్ల సినిమాలకు గోపి తన కలంతో ఇచ్చిన టచ్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటివాడు తానే స్వయంగా ఓ సినిమా డైరెక్డ్ చేస్తున్నాడంటే తప్పకుండా అంచనాలు పెంచుకోవచ్చు. అలాంటి సినిమాలో సునీల్ చాన్స్ కొట్టేశాడు. మరి ఈ ఇద్దరూ కలిసి ఎలా ఎంటర్ టైన్ చేస్తారో చూడాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: