టాలీవుడ్ లో 80వ దశకంలో ఎన్నో సినిమాలో తనదైన విలనీజం చూపించిన నటులు గొల్లపూడి మారుతీరావు...తర్వాత పలు క్యారెక్టర్ పాత్రల్లోనటించి మెప్పించారు.  గొల్లపూడి మారుతీరావు కేవలం నటులుగానే కాకుండా ఎన్నో రంగాలలో పరిపూర్ణత సాధించిన బహు కళా ప్రపూర్ణుడు. విలక్షణ నటుడు, హాస్యనటుడు, ప్రతి నాయకుడు, రచయిత, కవి, జర్నలిస్టు, ప్రసంగీకుడు. ఇలా పలు రంగాల్లో రాణించారు.  సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు.

తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో అబ్బాయిగా మారుతీరావు జన్మించారు.  1959లో ఆంధ్రప్రభ దినపత్రికకు ఉప సంచాలకునిగా, 1960లో చిత్తూరు ఎడిషన్ కు సంపాదక మండిలిలో ఒకడిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాదు, విజయవాడలలో ఆకాశవాణికి ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్ గా, ఆ తర్వాత సంబల్ పూర్, చెన్నై, కడపలలో రేడియో కార్యనిర్వహన అధికారిగా పనిచేశారు.

1981లో కడప కేంద్రం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ పొందారు. మారుతీరావు 14ఏళ్లకే  రచనలు చేయడం ప్రారంభించాడు. ప్రారంభ రోజుల్లో కవిత్వం ఎక్కువగా రాశాడు. అవి 'మారుతీయం' పేరుతో ఆ కవిత్వం పుస్తకంగా కూడా వచ్చింది. వీరి మొదటి కథ 'ఆశాజీవి' ప్రొద్దుటూరులోని స్థానిక పత్రిక 'రేనాడు'లో ప్రచురింపబడింది. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న అజిత్ కుమార్ మొదటి సినిమా  'పెళ్లిపుస్తకం' సినిమాకి దర్శకత్వం వహిస్తూ గొల్లపూడి చిన్నకొడుకు చనిపోతే అతని పేరుతోనే స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశాడు.

మారుతీరావుకు ఎన్నో అవార్డులు పురస్కారాలు వచ్చాయి.  సినీ రచయితగా నాలుగు నంది పురస్కారాలు సొంతం చేసుకున్న గొల్లపూడి మారుతీరావుకి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్నతో పాటు... మరెన్నో విశిష్ట పురస్కారాలు లభించాయి. ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి మారుతీరావు పలువురు ప్రముఖల్ని ఇంటర్య్వూ చేశారు. మనసున మనసై, ప్రజావేదిక, వేదిక, సినీ సౌరభాలు తదితర కార్యక్రమాలకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రు, ఏది నిజం? తదితర సిరియల్స్ లో నటుడిగా కూడా మెప్పించారు. వెండితెర, బుల్లితెరపై ఆయన ఎన్నో అద్భుతాలు పండించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: