రెండేళ్ల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 1 పై మొదట్లో మన తెలుగు ప్రజల్లో కొన్ని అపోహలు ఉండేవి. ఇటువంటి షోలు మన తెలుగులో నడుస్తాయా, ప్రజలు ఈ తరహా షోలకు ఎంతవరకు ఆదరిస్తారు, గృహిణుల నుండి ఇటువంటి షోలకు మద్దతు రాకపోవచ్చు వంటి పలు ఊహాగానాలు అప్పట్లో చాలానే ప్రచారం అయ్యాయి. అయితే షో ప్రారంభం నుండి మెల్లగా ఒక్కొక్కరోజు గడిచే కొద్దీ మంచి క్రేజ్ తో ముందుకు సాగి, చివరకు మంచి రేటింగ్స్ సాధించి ముగిసింది సీజన్ 1. దాని తరువాత నాచురల్ స్టార్ నాని హోస్టుగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 2 కూడా అదే విధంగా సూపర్బ్ క్రేజ్ తో ముందుకు నడిచి, 

మంచి వీక్షకధారణతో పాటు రేటింగ్స్ కూడా బాగానే రాబట్టడం జరిగింది. ఇక ఇటీవల కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3, ప్రారంభ సమయంలో ఎంతో  అదరగొట్టినప్పటికీ,మధ్యలో కొద్దిపాటి వివాదాల్లో ఇరుక్కుని ఒకింత క్రేజ్ తగ్గించుకుంది. అయితే ఆ తరువాత నుండి మెల్లగా నాగార్జున తన ఆకట్టుకునే హోస్టింగ్ టాలెంట్ తో షోను ముందుకు తీసుకెళ్లారు. ఇక రాను రాను మంచి క్రేజ్ పెంచుకుంటూ దూసుకెళ్లిన ఈ షోకి సంబంధించి ఇటీవల జరిగిన గ్రాండ్ ఫినాలే కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేసి, ఫైనల్ విన్నర్ గా సెలెక్ట్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కు షీల్డ్ బహుకరించడం జరిగింది. 

అయితే ఆరోజు జరిగిన షోకు ఏకంగా 18.29 పాయింట్స్ టిఆర్పి రేటింగ్స్ దక్కినట్లు నేడు ఫిలిం నగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఒకరకంగా గతంలో జరిగిన రెండు సీజన్స్ తో పోలిస్తే  ఈ సీజన్ కు 4 పాయింట్లు అధికంగా టిఆర్పి రేటింగ్స్ దక్కినట్లు చెప్తున్నారు. ఇది ప్రేక్షకులు అందించిన అతి పెద్ద విజయమని బిగ్ బాస్ టీమ్ ఈ రేటింగ్స్ పై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోందట. ఇక నాగార్జున కూడా ఈ విషయమై తమ షోని ఎంతో ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాధాలు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ షో తాజా సీజన్ వచ్చే ఏడాది జూన్ నెలాఖరు నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: