నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'రూలర్'. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను గురువారం సాయంత్రం చిత్ర బృందం విడుదల చేశారు. ఇక అభిమానులు బాలయ్య నుండి ఏ అంశాలు ఆశిస్తారో వాటిని పూర్తిగా కలగా పులగం చేసి పక్కా కమర్షియల్ కిచిడి వంటకంలా కనిపిస్తోంది ఈ టీజర్.  ఫైట్స్.. డ్యాన్స్.. పంచ్ డైలాగ్స్.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్.. ఇలా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే కొత్తగా ఏమీ అనిపించకపోయినా ఏదో కొత్తగా చెప్పడానికే ట్రై చేస్తున్నారన్న విషయం అర్థమవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో మన బాలయ్య విభిన్న గెటప్స్ కూడా ఫ్యాన్స్ ని బాగా ఆకర్షిస్తున్నాయి.

అయితే ఈ విగ్గులు బాలయ్యకు అంతగా సెట్ కాలేదని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరు టీజర్ రిలీజైనప్పటి నుంచే ట్రోల్ చేయడము మొదలు పెట్టారు. టీజర్లో బాలయ్య రెండు రకాల గెటప్స్ లో కనిపించారు. ఒక గెటప్ లో పొడవాటి జుట్టు.. మధ్య పాపిడి.. గడ్డంతో పోలీస్ ఆఫీసర్ గా యంగ్ హీరోలా చెలరేగిపోయారు. బాలయ్య నటనకు ఏ ఒక్కరు వంకలు పెట్టలేరు. కానీ ఆ విగ్.. ఆ హెయిర్ స్టైల్ బాలయ్య బాబుకు సూట్ కాలేదని కాస్త వెటకారమైన  మాటలు వినిపిస్తున్నాయి. ఈ గెటప్ లోనే రెండు వేరియేషన్లు ఉన్నాయి. ఒకటేమో ఫుల్ బ్లాక్ గడ్డంతో యంగ్ లుక్ కాగా మరో సీన్లో కాస్త నెరిసిన జుట్టుతో కనిపిస్తున్నారు. ఇక మరో గెటప్ లో బాలయ్య టోనీ స్టార్క్ తరహాలో గడ్డంతో మీడియంగా ఉండే జుట్టుతో కనిపించారు. ఈ విగ్ కూడా బాలయ్యకు ఏ మాత్రం సూటవ్వలేదని అంటున్నారు. ఇది జస్ట్ టీజరే కాబట్టి సినిమాలో బాలయ్య గెటప్స్ ఎలా ఉంటాయో చూడాలి.

ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్.. భూమిక ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి కి సంగీతమందించిన చిరంతన్ భట్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సీ. కళ్యాణ్ నిర్మిస్తుండగా 'జైసింహా' లాంటి హిట్ తర్వాత బాలయ్య-కెయస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకుంటుందనే అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: