ఆమె వెడితెరపై కనిపిస్తే చాలు కుర్రకారుగుండెల్లో సరిగమలు మ్రోగేయి. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. అదం , అభినయంతో ప్రేక్షుల మనసును గెలుచుకుంది. అందాల తార సిల్క్ స్మిత..వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటి. 80, 90లలో ఆమె పేరు దక్షిణాదిన మార్మోగింది. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆమె.. అర్ధాంతరంగా తనువు చాలించారు. ఇవాళ ఆమె 59వ జయంతి సంధర్భంగా ఒక సారి సిల్క్ ని గుర్తుచేసుకుందాం..
  

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1960 డిసెంబర్ 2న పుట్టిన స్మిత... సినిమాలపై ఇష్టంతో చెన్నై వెళ్లారు. అసలు పేరు విజయలక్ష్మి. ఆమె తొలి చిత్రం బండి చక్రం. తమిళంలో రిలీజైంది. మొదట్లో హీరోయిన్‌గా ట్రై చేసినా... ఆమెను వ్యాంప్ క్యారెక్టర్లకే పరిమితం చేసింది చిత్రసీమ. కానీ హీరో, హీరోయిన్లకు మించి పాపులారిటీని ఆమె సంపాదించుకున్నారు.


ఏమాత్రం మోమాటం లేకుండా నర్తించి, నటించి, ఒళ్ళు దాచుకోకుండా కనిపించి, కవ్వించి... నిర్మాతలకు కాసుల వర్షం కురిపించేందుకు తనవంతుగా కృషి చేశారు. చారడేసి కళ్ళు పలికించే శృంగార నైషధాలు ఎన్నో? లిపి స్టిక్ రాసుకున్న పెదాల్లో పరుచుకున్న మంచు తుఫానులు ఇంకెన్నో? ఆకట్టుకునే శరీర సౌష్టవం... నడిచినా నర్తించినట్లనిపించే సోయగం... ముద్దు ముద్దు మాటలు...కత్తిలాంటి పాటలు... ఆమెకి తప్ప అనితర సాధ్యం. 


కేవలం సిల్క్‌ను చూసేందుకే థియేటర్ కొచ్చే అభిమానులు ఆమె సొంతం. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతో పాటు బాలీవుడ్‌లో సుమారు 2 వందలకు పైగా సినిమాల్లో ఆమె నటించారు. 36 ఏళ్ల వయసులో 1996 సెప్టెంబర్ 23న మద్రాసులోని తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు. అప్పట్నించీ ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.


స్మిత మరణించి ఎన్నేళ్లయినా...ఆమె మిగిల్చిన కదిలే బొమ్మలు సజీవంగానే ఉంటాయి. సినిమా ప్రపంచంలో స్మిత మరపురాని, మరచిపోలేని తెరతారక. ఆ తారక ప్రేక్షకుల గుండెల్లో తళుక్కుమంటూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: