జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు సిసలైన రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో పవన్  నిరూపిస్తున్నారు అని చాలామంది భావిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జగన్ ప్రభుత్వం అసమర్థతను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. ఇటు తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మా అధ్యక్షుడు నరేష్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. 

 


 తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సీనియర్ నటుడు నరేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వందల కోట్లు కావాలని నరేష్ అన్నారు. కానీ సినీ హీరో గా తన కెరియర్ ఒక రేంజిలో ఉన్నప్పటికీ కూడా... కెరియర్ ని వదిలేసి ఏసీ గదుల్లో లైఫ్ ని  వదిలేసి... పవన్ కళ్యాణ్ ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల్లోకి వెళ్లి ప్రజా సేవ చేస్తున్నారు అంటూ నరేష్ ప్రశంసించారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం రాజకీయాల్లోకి కావాలి అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఐ లైక్ పవన్ కళ్యాణ్..ఐ  సపోర్ట్ పవన్ కళ్యాణ్ అంటూ మా అధ్యక్షుడు నరేష్ అన్నారు. 

 


 రాజకీయాలను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలని  పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని.. ఎలాంటి పదవి లేకున్నప్పటికీ ఒక సిద్ధాంతంతో దృఢసంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్న విధానం తనకు నచ్చిందని... పవన్ కళ్యాణ్ కు తన నైతిక మద్దతు ఉంటుందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అన్న విమర్శలపై మా అధ్యక్షుడు సినీ నటుడు స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అంటూ నరేష్  అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని.. అలాంటి విషయాలను బహిరంగంగా ప్రస్తావించే వారికి కొంచమైన సిగ్గు అనిపించదా  అంటూ ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: