తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ "ఊహలు గుసగుసలాడే" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్యకి మొదటి చిత్రమే మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రంలో న్యూస్ రీడర్ గా పనిచేద్దామనుకునే కుర్రాడిగా చాలా క్లాస్ గా కనిపించాడు. అయితే ఈ సినిమా తర్వాత అతడు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. క్లాస్ హీరోగా ఉంటూ "జాదూగాడు" అనే మాస్ సినిమా చేసినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు.
అయితే అదలా ఉంచితే, ఆ తర్వాత మళ్ళీ క్లాస్ హీరోగా ఛలో సినిమా చేశాడు. తన సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందించింది. అయితే ప్రస్తుతం నాగశౌర్య మళ్ళీ మాస్ మంత్రం జపించే పనిలో పడ్డాడు. తనకి అచ్చొచ్చిన క్లాస్ ని విడిచి మాస్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సొంత బేనర్లో రమణతేజ అనే కొత్త దర్శకుడితో అశ్వత్థామ అనే సినిమాను లైన్లో పెట్టాడు.
ఈ మధ్య రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ని చూస్తే ఇది మాస్ సినిమానే అని అర్థమై పోతుంది. ప్రేమ పేరిట అమ్మాయిలపై యాసిడ్ దాడులు చేసే మృగాళ్లపై పోరాడే కుర్రాడి పాత్రను చేస్తున్నాడు శౌర్య ఈ సినిమాలో. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. జనవరి 30న "అశ్వత్థామ" సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతి కి వచ్చే సినిమా సందడి ముగిసాక ఏర్పడే ఖాళీని క్యాష్ చేసుకునేందుకు వీలుగా ఆ తేదీకి ఫిక్స్ అయ్యారు.
ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా మెహ్రీన్ పిర్జాదా నటిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఐరా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.