నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న హ్యాట్రిక్ సినిమా త్వరలో సెట్స్ మీదకెళ్లనున్న సంగతి తెలిసిందే. సింహ.. లెజెండ్ తర్వాత మూడోసారి ఈ కాంబినేషన్ ఇప్పుడు రిపీటవుతోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న బోయపాటి ముందు ఈసారి పెద్ద ఛాలెంజ్ ఉంది. అందుకే ఈసారి బాలయ్యకు బ్లాక్ బస్టర్ ఇచ్చి తాను మళ్ళీ సక్సస్ ట్రాక్ లోకి రావాలని కసితో పనిచేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసి షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదీ అంటూ ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

 

బాలయ్య ఇమేజ్ .. స్క్రిప్ట్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని 'ఐకాన్' అనే టైటిల్ ని బోయపాటి ఫిక్స్ చేయాలని అనుకున్నారట. అయితే ఈ టైటిల్ ఇప్పటికే నిర్మాత దిల్ రాజ్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి టైటిల్ పోస్టర్ ని ఇంతకుముందు రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు బాలయ్య -బోయపాటి కథకు అదే టైటిల్ పక్కాగా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారుట. ఈ నేపథ్యంలో దిల్ రాజు ని ఒప్పించి టైటిల్ సొంతం చేసుకునే ఆలోచనలో బోయపాటి ఉన్నట్లు మరో ప్రచారం కూడా సాగుతోంది.

 

దిల్ రాజు ఇంకా ఆ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టలేదు కాబట్టి బాలయ్య పై గౌరవంతో ఆ టైటిల్ ను త్యాగం చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. లెజెండ్- సింహా- జైసింహా లాంటి టైటిల్స్ లో పవర్ .. మాసిజం కనిపిస్తోంది. కానీ ఐకాన్ టైటిల్ లో మాత్రం ఆ రెండు మిస్సవుతున్నట్టే కనిపిస్తోంది. అయితే ఈ టైటిల్ తో బాలయ్యను క్లాసీ గా చూపించే ఉద్ధేశం ఏదైనా ఉందా? అసలు ఈ టైటిల్ బాలయ్య కు పర్ ఫెక్ట్ గా సూటవుతుందా? అన్న సందేహాలు మరోవైపు ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో మొన్నా మధ్య వరకు బాలయ్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతోందని ప్రచారం జరిగింది. కానీ అందులో క్లారిటి రాకముందే కేథరీన్ ని ఎంపిక చేశారని మరో న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఇక శ్రీకాంత్ బాలయ్య సినిమాలో విలన్ గా నటిస్తున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: