ఒకే కుటుంబానికి చెందిన నటీనటులను మరియు ఒక మూడు తరాల హీరోలను ఒక సీన్ లో సిల్వర్ స్క్రీన్ పైన చూపిస్తున్నారు అంటే ఆ సినిమాపై ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు. అలాంటిది ఒక సినిమా మొత్తాన్ని మూడు తరాలకు చెందిన హీరోల పైనే చిత్రీకరిస్తే? ఆ ఊహను సినిమాలో చాలా కచ్చితత్వంతో ఏ లోటు లేకుండా చూపించాలంటే దర్శకుడు తల పగిలి వెయ్యి ముక్కలు అవుతుంది. గతంలో అంటే ఇది చాలా సర్వసాధారణమైన విషయం కానీ ఇప్పుడు జనాల ఆలోచనా తీరు మారిన నేపథ్యంలో ఇలాంటి సాహసాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఒక వైవిధ్యమైన కథ ఉంటే అది ఎందుకు సాధ్యపడదు అని మిగతా దర్శకులు అందరినీ ప్రశ్నించాడు విక్రమ్ కె కుమార్. ఆ ప్రశ్నకు తానే సరైన సమాధానమే నిలిచారు కూడా.

 

2014లో అక్కినేని కుటుంబం అయిన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం 'మనం'. ఆ సినిమాలోని కథానాయికలలో ఒకరైన సమంత తర్వాత అదే కుటుంబానికి కోడలు కావడం మరో విశేషం. అయితే ప్రకటించిన తర్వాత విడుదలైన మొట్టమొదటి పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్ధమైపోయి ఉంటది ఈ సినిమా భావి తరాలకు ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయత్నమని. ఇది సఫలం అవుతుందా కాదా అన్నది పక్కన పెడితే అంతటి సాహసానికి ఒడిగట్టిన విక్రమ్ యొక్క గట్స్ ను మెచ్చుకున్నారు అందరూ. ఇక సినిమా విషయానికి వస్తే లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమా. సినిమా పూర్తికాకుండానే ఆయన ఆకస్మిక మరణం చెందినా ఎప్పటికీ 'మనం' సినిమా రూపంలో ఆయన ఎప్పటికీ మన మధ్యనే నిలిచిపోవాలి అన్నట్లు తీశారు. 

 

సినిమా కథ విషయంలో కూడా ఒకే కుటుంబానికి చెందిన నటీనటులు మధ్య కెమిస్ట్రీ మరియు సహాయక బృందం, ఇతర నటీనటుల నుండి వచ్చిన సహకారం, అందరితో ఎమోషన్స్ భారీగా పలికించగల విక్రమ్ కథకి ఉన్న సామర్థ్యం మొత్తం కలిసి 'మనం' ను తెలుగు చిత్ర సీమలో ఒక మైలురాయిగా తీర్చిదిద్దాయి. తర్వాత కొన్ని కుటుంబాలు ఇదే రీతిలో సినిమాలు చేసినా ఇది ఇచ్చినంత కిక్ ను ఇవ్వలేకపోయాయి సరికదా కనీసం ఈ సినిమా దరిదాపుల్లోకి కూడా రాలేదు. మారుతున్న ప్రేక్షకుడి అభిరుచిని బట్టి మనం గమనిస్తే 'మనం' నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: