2010 నుంచి 2020 మధ్య కాలంలో టాలీవుడ్ లో ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. పలువురు నటులు కన్నుమూయడం టాలీవుడ్ ఇండస్ట్రీని శోక సంద్రంలో మునిగేలా చేసింది. వారి జ్ఞాపకాల్లో అలా ఉండిపోయింది. ఎందరో నటులు అందని దూరాలకు వెళ్లడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ బోసిపోయింది. వాళ్ల లేని లోటు తీరనిది అంటూ ఇప్పటికీ పలువురు వారిని తలుచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 


ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. నటనా, రచనా రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన సాహితీ రంగంలోనూ ఆయన విశిష్ట కృషి చేశారు. రేడియో వ్యాఖ్యతగా కెరీర్‌ మొదలుపెట్టిన గొల్లపూడి.. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. స్వాతిముత్యం లాంటి సినిమాలో వినూత్న విలనిజం చూపించారు. నాటకాలు, నాటికలు, కథానికలు, సినిమా కథలు పత్రికా వ్యాసాల్లో గొల్లపూడి మారుతీరావు ముద్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.

 

అంతకుముందు నటి గీతాంజలి కన్నుమూశారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన గీతాంజలి.. ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ఆయనే కథానాయుడిగా నటించిన సీతారాముల కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. అన్ని భాషల్లోనూ 500కు పైగా చిత్రాల్లో నటించారు. కలవారి కోడలు, డాక్టర్‌ చక్రవర్తి, లేతమనసులు, బొబ్బిలియుద్ధం, ఇల్లాలు, దేవత, గూఢచారి116, కాలం మారింది, శ్రీ శ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన ఆమె పెళ్లైన కొత్తలో,మాయాజాలం, భాయ్‌, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్‌ మహాలక్ష్మి. రాజకీయాల్లోకి వచ్చిన గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 

 

ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు దేవ‌దాస్ క‌న‌కాల క‌న్నుమూశారు. 1945, జూలై 30 యానంలో జ‌న్మించిన దేవ‌దాస్ చ‌లిచీమ‌లు, నాగ‌మ‌ల్లి చిత్రాల‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ న‌డిపిన దేవ‌దాస్ క‌న‌కాల ఎంతో మందికి న‌ట‌న నేర్పించారు. 


20 ఏళ్లుగా వెండి తెరపై అలరించిన వెండి తెర హాస్య నటుడు వేణు మాధవ్ తెలుగు ప్రేక్షకులకు శాశ్వతంగా దూరమయ్యారు. దాదాపు 600కి పైగా సినిమాల‌లో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాల‌లో హీరోగా చేశారు. చివరి సారిగా వేణుమాధవ్ రుద్ర‌మ‌దేవి చిత్రంలో కనిపించారు. ఎస్వీ కృష్ణారెడ్డి తెర‌కెక్కించిన సంప్ర‌దాయం సినిమాతో ఆయన సినీ ప్రస్థానం మొదలయ్యింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు. తొలిప్రేమ, సై, ఛత్రపతి, దిల్ సినిమాలు అతనికి మంచి పేరు తీసుకొచ్చాయి. 


ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. 1945 జులై 30న యానాంలో జన్మించిన దేవదాస్ నాటకరంగంలో, సినీ ఇండస్ట్రీలో ప్రముఖ పాత్ర పోషించారు. నటుడిగాను, దర్శకుడిగాను రాణించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ స్థాపించి ఎంతోమంది ప్రముఖ నటులకు, స్టార్‌ హీరోలకు నటనలో ఓనమాలు దిద్దించారు. 


ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణతో అత్యధికంగా 47 చిత్రాల్లో నటించి సంచలనం సృష్టించింది విజయనిర్మల. అలాగే మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు సంపాదించుకుంది. 44 చిత్రాలకు దర్శకత్వం వహించింది విజయనిర్మల. 1946 ఫిబ్రవరి 20 న తమిళనాడు లో జన్మించింది విజయనిర్మల. బాలనటిగా చిత్రరంగంలో అడుగుపెట్టి 200 చిత్రాలకు పైగా నటించింది. అయితే అందులో ఎక్కువగా కృష్ణతోనే నటించడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది దాంతో రెండో వివాహం చేసుకున్నారు. 


సినీ, రాజకీయ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 


టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్ను మూశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. దాసరి నారాయణ రావు శిష్యుడిగా మొదలైన అయన ప్రస్థానం.. తెలుగు తెరపై ఓ ముద్ర వేసింది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన ఆయన వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. 2016లో కన్నడ చిత్రమైన ‘నాగహారవు’ ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా. చిరంజీవికి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, బాలకృష్ణకు మంగమ్మ గారి మనవడు లాంటి బ్లాక్‌​బస్టర్‌ హిట్‌లు అందించిన కోడి రామకృష్ణను పది నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వరించాయి.  ఆయన 2012లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని అందుకున్నారు. 


హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. అమృతం సీరియల్ అనగానే గుర్తువచ్చే నటుడు హనుమంత్ రావు ...తన కామెడీతో అందరిని కడుపుబ్బరం నవ్వించడం ఆయన ప్రత్యేకత .అహనా పెళ్ళంటా సినిమా లో వినబడట్లేదు అనే డైలాగ్ తో ఏంటో ఫేమస్ అయ్యాడు.

 

ప్రముఖ నటి మనోరమ మృతి చెందారు. మనోరమ అసలు పేరు గోపిశాంత, తమిళం , తెలుగు, ఇతర భాషల్లో వెయ్యికిపైగా సినిమాల్లో నటించారు. బుల్లితెరపై కూడా పలు సీరియళ్లలో కనిపించారు. తమిళ చిత్ర పరిశ్రమలో అచ్చిగా అంటే బామ్మగా ఆమెకు గుర్తింపు ఉంది. మనోరమ సినిమా రంగంలో ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పని చేశారు. తెలుగులో ఎన్‌టిఆర్, తమిళంలో ఎంజిఆర్, అన్నాదురై, కరుణానిధి, జయలలితతో కలిసి ఆమె నటించారు, తమిళనాడులోని తంజావూరులోని మన్నార్గుడిలో ఆమె జన్మించారు. పేద కుటుంబంనుంచి వచ్చిన ఆమె తొలుత రంగస్థల నటిగా గుర్తింపు పొందారు. తర్వాత సినీరంగంలోకి వచ్చారు. ఆమె తెలుగులో రిక్షావోడు, శుభోదయం, అరుంధతి తదితర సినీ రంగంలోకి వచ్చారు. 


ఆర్తి అగర్వాల్ టాలీవుడ్‌లో ఉన్నంత కాలం ఆమెకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. కానీ దురదృష్టవశాత్తు, గుండె ఆగిపోవడం వల్ల ఆమే 31 సంవత్సరాల వయస్సులోనే మరణించారు. ఆర్తి అగర్వాల్ కు లిపోసక్షన్ శస్త్రచికిత్స కూడా జరిగింది.

 

తెలుగు చలనచిత్ర నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జనవరి 22, 2014న కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో  సెప్టెంబర్ 20, 1920న ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన అక్కినేని తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడుగా ఎదిగారు. 1944లో సినీ జీవితాన్ని మొదలు పెట్టిన నాగేశ్వరరావు తొలి చిత్రం ధర్మపత్ని. చివరి చిత్రం మనం. ఆయన ధరించిన ఎన్నో పాత్రలు చిరస్మరణీయాలై మిగిలిపోయాయి. అక్కినేని నాగేశ్వరరావు నటజీవితం స్ర్తి పాత్రలతో మొదలైంది. బతుకుతెరువు కోసం ఆయన నాటకాల్లో స్ర్తి పాత్రలు వేసేవారు. ఘంటసాల బలరామయ్య ద్వారా వెండితెరకు ఆయన పరిచయమయ్యారు. సాంఘిక, పౌరాణిక, జానపదం ఇలా అన్నిరకాల పాత్రలను పోషించిన అక్కినేని నాగేశ్వరరావు మొత్తం 256 చిత్రాలలో నటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ తరలించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం. ఆ కృషిలో భాగంగా ఆయన తొలుత అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు. దేవదాసు, దసరాబుల్లోడు, ప్రేమనగర్, బుద్ధిమంతుడు వంటి పలు ప్రజాదరణ పొందిన చిత్రాలలో ఆయన నటించారు.

 

ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు కన్నుమూశారు. నేనొప్పుకొను.. అయితే ఓకే అనే డైలాగ్‌తో పాపులర్‌ అయిన కొండవలస.. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షక్షుల హృదయాలను తన నటన శైలితో ఆకట్టుకున్నారు. నాటక రంగంలో మొత్తం 378 అవార్డులతో పాటు రెండు నంది అవార్డులు కూడా ఆయనకు వరించాయి. వంశీ దర్శకత్వంలో ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అనే చిత్రంతో సినిమారంగంలోకి వచ్చారు. సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్టు ట్రస్టులో కొండవలస ఉద్యోగిగా పనిచేశారు. ఆగస్టు 10, 1946వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా, కొండవలస గ్రామంలో లక్ష్మణరావు జన్మించారు.


ప్రముఖ దర్శక, నిర్మాత, రాజకీయ నాయకుడు దాసరి నారాయణరావు కన్నుమూశారు. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డగా ఎన్నో కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు. 151 సినిమాలకు దర్శకత్వం వహించారు. 250 చిత్రాలలో మాటలు, పాటలు అందించారు. తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా మారిన దాసరి తొలి చిత్రంతోనే నంది అవార్డు అందుకుని సంచలనం సృష్టించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు.  2 జాతీయ, 9 నంది, 4 ఫిల్స్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. అత్యదిక సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డుకెక్కారు అనేక మంది తెలుగు దర్శకులు, నటులు, నటీమనులకు వెండితెరను పరిచయం చేశారు. దాసరి చివరి చిత్రం ఎర్రబస్సు.

 

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య టాలీవుడ్ ను శోక సంద్రంలో ముంచేసింది. ప్రజల గుండెల్లొ చిర స్ఠాయిగా నిలిచిపోయో సినిమాలు చేసి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని అందరికి అందనంతదూరంగా వెళ్ళిపోయాడు.

 

మూవీ మొగల్‌,  సురేష్‌ ప్రాడక్షన్స్‌ అధినేత, ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూశారు. రాముడు భీముడుతో ప్రారంభమైన ఆయన సినీ జీవితంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. భారతీయ భాషలన్నింటిలోనూ సినిమా నిర్మించిన ఘనత కూడా రామానాయుడుదే. నిర్మాతగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆయన ఎంతోమంది నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకులను చిత్రసీమకు పరిచయం చేశారు.


క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఏవీఎస్ కన్నుమూశారు. 1993లో విడుదలైన 'మిస్టర్‌ పెళ్లాం' సినిమాతో ఏవీఎస్‌ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కామెడీ స్టార్‌గా మారిపోయారు. ఈ చిత్రంలోని పాత్రకి ఏవీఎస్‌కి నంది పురస్కారం లభించింది. ఈ సినిమాలో ఏవీఎస్‌ 'నాకదో తుత్తి' అని అంటూ ఉంటారు. ఈ డైలాగ్‌ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. అసలు ఈ సినిమాతో ఏవీఎస్‌ సినిమా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన 'శుభలగ్నం' చిత్రంలో 'గాలి కనుబడుతుందా?' అంటూ అనేకానేక ప్రశ్నలు వేసి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. 'ఘటోత్కచుడు' సినిమాలో 'రంగు పడుద్ది' అని చెప్పి ప్రేక్షకుల మోములో నవ్వులు పూయించారు. కొన్ని సినిమాలలో ప్రతినాయక పాత్రలలో కూడా నటించి మెప్పించారు. 'అంకుల్‌', 'ఓరి నీ ప్రేమ బంగారం కాను' సినిమాలను నిర్మించారు. 'సూపర్‌ హీరోస్‌', 'ఓరి నీ ప్రేమ బంగారం కాను', 'రూమ్‌ మేట్స్‌', 'కోతిమూక' చిత్రాలకు దర్శకత్వం వహించారు. 19 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 500 చిత్రాల్లో నటించారు ఏవీఎస్‌. హాస్యనటుడిగా సుమారు 450 సినిమాలల్లో చేశారు. నారదుడిగా, శకునిగా పౌరాణిక సినిమాలలోనూ నటించారు. 


తెలుగు సినిమాల్లో సీనియర్ టీవీ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రంగనాథ్ తన సంపద అంతా తన పనిమనిషికి వదిలి పైకప్పు నుంచి ఉరి వేసుకున్నాడు. అతని సూసైడ్ నోట్ గోడపై రాశారు. అతని ఆత్మహత్యకు అసలు కారణం తెలియదు.


ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. పలు తెలుగు సినిమాలు, టీవీ సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. నటుడిగా, విలన్ గా, పలు పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరమయ్యారు.

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ గా వెలుగొందిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయారు. ప్రకాశం జిల్లా బల్లి కురవ మండలం కొమ్మినేనివారిపాలెం లో జన్మించిన ధర్మవరపు ‘బావా బావ పన్నీరు’ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. దూరదర్శన్ లో ఆయన చేసిన ఆనందో బ్రహ్మ హాస్య సీరీయల్ తో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత ప్రముఖ హీరోల అందరి సినిమాల్లోనూ నటించి తెలుగు ప్రేక్షకులను నవ్వించారు. తెలుగులో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ ఆయన డైలాగ్ డెలివరీకి మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ఆయన చంపోవడం టాలీవుడ్ కామెడీ రంగానికి, తన తోటి కమెడియన్స్ కి తీరని లోటు అనేది మాత్రం అర్థమవుతోంది.

 

ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూశారు. బాపు మార్క్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. ఆయన 1933 డిసెంబర్ 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కంతేరులో జన్మించారు. ముళ్లపూడి రమణ, బాపు కాంబినేషన్ చలనచిత్ర రంగంలో పేరెన్నిక గన్నది. రమణ రాత, బాపు గీత అనేది సాహిత్య ప్రపంచంలో కూడా చిరకాలం నిలిచిపోయింది. కార్టూనిస్టుగా ఆంధ్రపత్రికలో 1945లో తన వృత్తిజీవితాన్ని ప్రారంభించిన బాపు 1967లో సాక్షి సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. బాపు వేసిన చిత్రాలు అత్యంత ప్రసిద్ధి. ఆయన చివరి సినిమా బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం 2011లో వచ్చింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా చిత్రాలు నిర్మించారు. ముత్యాలముగ్గు సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు పొందింది. ఆందాలరాముడు, రాధాకళ్యాణం, మిస్టర్ పెళ్లాం, రాధాగోపాలం, సుందరకాండ వంటి పలు ప్రసిద్ధి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయనకు 1986లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. బాపు రెండు సార్లు జాతీయ అవార్డులు, రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఐదు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. బాపును 2013లో పద్మశ్రీ అవార్డు వరించింది. 1991లో ఆయనను ఆంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కథానాయికలను ఆయన చూపించే పద్ధతి విశేష జనాదరణ పొందడమే కాకుండా ప్రసంశలు అందుకుంది. తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. 


ప్రముఖ హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ కన్నుమూశారు. ఎం.ఎస్. నారాయణ వయసు 63 సంవత్సరాలు. 1951వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో జన్మించిన ఆయన పూర్తిపేరు మైలవరపు సూర్యనారాయణ. మొదట తెలుగు లెక్చరర్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత సినిమా రంగానికి వచ్చి అనేక సినిమాలకు రచయితగా పనిచేశారు. ఆయన ఆ తర్వాత నటుడిగా మారారు. 500 పైగా సినిమాలలో నటించారు. హాస్యపాత్రల పోషణలో ప్రత్యేక శైలితో ఆయన తెలుగువారిని అలరించారు. ఐదు నంది అవార్డులు, ఒక ఫిలిం ఫేర్ అవార్డు ఆయన అందుకున్నారు. 

 

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి  కన్నుమూశారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన చక్రధర్ గిల్లా సినీరంగంలో చక్రిగా అరంగేట్రం చేసిన విషయం తెల్సిందే.  సుమారుగా 85 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన చక్రి, 'సత్యం 'సినిమాకు అందించిన సంగీతానికి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు.  'సింహా' చిత్రానికి ఆయన నంది అవార్డును గెలుచుకున్నారు. 'బాచీ' సినిమాతో అరంగేట్రం చేసిన చక్రి 1974, జూన్ 15వ తేదీన జన్మించారు. చక్రి చివరిసారిగా సంగీతం అందించిన చిత్రం 'ఎర్రబస్సు'. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చింది. పలువురు గాయనీ, గాయకులను ఆయన సినీరంగానికి పరిచయం చేశారు. 


ప్రముఖ సినీనటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయస్సు 58 ఏళ్లు. 1958 జనవరి 2 న కృష్ణాజిల్లా కోడూరులో జన్మించిన ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్‌. నాగార్జున ఫస్ట్ మూవీ విక్రమ్‌తో నటుడిగా పరిచయమైన ప్రసాద్, ‘ఆహుతి’ చిత్రంతో తనకంటూ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన గులాబి, నిన్నే పెళ్లాడతా, చందమామ , కొత్తబంగారు లోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 122 సినిమాల్లో ఆహుతి ప్రసాద్ నటించారు. తెలుగులో 120, రెండు తమిళ చిత్రాలు చేశారు. 'చందమామ' చిత్రానికి బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డులు అందుకున్నారు. 

 

తన విలక్షణ నటనతో విభిన్న పాత్రల్లో రాణించి, అలరించిన నటుడు రఘుముద్రి శ్రీహరి కన్నుమూశారు. అనేక చిత్రాల్లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీహరి హఠాన్మరణం చెందారు. 1964 ఆగస్టు 15వ తేదీన జన్మించిన ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో వివిధ పాత్రల్లో జీవించి గుర్తింపు పొందారు.  హైదరాబాద్ బాలానగర్‌లో జన్మించిన శ్రీహరి తొలి చిత్రం 'పృథ్వీపుత్రుడు'. తొలుత విలన్ షేడ్స్, తర్వాత పూర్తి స్థాయి ప్రతినాయకుడి వేషాలు, హీరోగా, కమెడియన్‌గా, అన్నయ్యగా, డాన్‌గా ఇలా అనేక క్యారెక్టర్‌లలో రాణించారు. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్‌లో ఆయనకంటూ కొన్ని పాత్రలు సృష్టించబడ్డాయంటే అతిశయోక్తికాదు. చిన్న బడ్జెట్ నిర్మాతలకు కల్పవృక్షంగా మారిన ఆయన అనేక చిత్రాల్లో నటించారు. నటనకు సరికొత్త భాష్యంగా నిలిచిన ఆయన ప్రతి చిత్రంలో చేసిన పాత్రలు ఆ చిత్ర విజయానికి కారణమయ్యాయి. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూ, మరోవైపు విలన్‌గా, కమెడియన్‌గా ఎలాంటి పాత్రలలోనైనా ఇమిడిపోయే విధంగా ఆయన పరిశ్రమకు పలు సేవలు అందించారు. 'శ్రీకృష్ణార్జున విజయం' చిత్రంలో దుర్యోధనుడిగా, 'శ్రీ జగద్గురు ఆదిశంకర' చిత్రాల్లో యోగి పుంగవుడిగా నటించి పౌరాణిక చిత్రాలకు కూడా తాను న్యాయం చేయగలనని నిరూపించారు. అనేక చిత్రాలకు నంది అవార్డులతో పాటుగా సాంస్కృతిక సంస్థలు అందించే పలు పురస్కారాలను అందుకున్నారు. సమాజంలో నిస్వార్థరహిత సేవకుగాను గుర్తింపు పొందారు. 

 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నవ్వుల దర్శకుడిగా పేరుగాంచిన ఈవీవీ సత్యనారాయణ కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన ఈవీవీ.. 'చెవిలో పువ్వు' సినిమాకు ఈవీవీ తొలిసారి దర్శకత్వం వహించారు. 'వారసుడు', 'హలో బ్రదర్'‌, 'అల్లుడా మజాకా' వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఈవీవీ దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వచ్చిన 'ప్రేమఖైదీ' చిత్రంతో ఆయన తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల వద్ద అసిస్టెంట్‌గా పలు చిత్రాల్లో పని చేసిన ఈవీవీ సినిమాల్లో వినోదాన్ని పండించడంలో తనకుతానే సాటి. ప్రధానంగా 'కామెడీ కింగ్' రాజేంద్ర ప్రసాద్‌తో ఈవీవీ తీసిన అనేక చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. తన కుమారులైన అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేష్‌లతో 'బెండు అప్పారావు', 'ఎవడిగోల వారిది', 'అత్తిలి సత్తిబాబు', 'కితకితలు' తదితర చిత్రాలను నిర్మించారు. వీటితో పాటు.. సీరియస్ హీరో శోభన్‌బాబుతో 'ఏవండీ ఆవిడ వచ్చింది', అమితాబ్‌ బచ్చన్‌తో 'సూర్యవంశ్' 'ఆమె', 'తాళి', 'ఆమ్మో ఒకటో తారీఖు' వంటి కుటుంబ కథా చిత్రాలను కూడా నిర్మించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 

 

2010వ సంవత్సరం నుంచి రానున్న 2020వ సంవత్సరం వరకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎందరో ప్రముఖ నటులను కోల్పోయింది. ఈ లోటు ఎవరూ తీర్చలేనిది.. పూడ్చలేనిది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: