టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసుడిగా చిన్నతనంలో నీడ అనే సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, ఆ వయసులోనే పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణను సంపాదించారు. కొంత వయసు వచ్చాక కృష్ణ, విజయశాంతి కలయికలో డ్యూయల్ రోల్ లో మహేష్ నటించిన కొడుకు దిద్దిన కాపురం సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని, బాలనటుడిగా మహేష్ కు మరింత మంచి పేరు తెచ్చింది. దాని తరువాత బాలచంద్రుడు అనే సినిమాలో నటించిన మహేష్, కొంత గ్యాప్ తీసుకుని 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

 

రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుని, తొలి సినిమాతోనే మహేష్ కు ప్రిన్స్ అనే పేరు తీసుకువచ్చింది. 
అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిన మహేష్ కు, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా వచ్చాయి. అయితే తనకు ఫ్లాప్స్ వచ్చినపుడు తాను ఎంతో దిగాలు పడతాను అని చెప్పే మహేష్, ఇకపై అటువంటి తప్పులు జరుగకుండా సరిచేసుకునేందకు ప్రయత్నిస్తానని చెప్తుంటారు. ఇక కెరీర్ పరంగా నాలుగవ సినిమా మురారి నుండి మొన్నటి మహర్షి వరకు చాలా సూపర్ హిట్స్ కొట్టిన మహేష్ బాబు, తొలిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006లో నటించిన సినిమా పోకిరి, అప్పట్లో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అప్పట్లో రూ. 43 కోట్ల షేర్ ని అందుకున్న సినిమాగా తిరుగులేని రికార్డు ని సొంతం చేసుకుంది. 

 

ఇక ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పిన రికార్డుల్లో కొన్నిటిని ఇప్పటికీ కూడా ఏ సినిమా టచ్ చేయలేకపోయిందంటే ఆ సినిమా రేంజ్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ విధంగా తండ్రికి తగ్గ తనయుడిగా ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో కొనసాగుతున్న మహేష్ సినిమా విడుదలవుతుందంటే అభిమానులకు పండగే పండగ. ఇక సినిమాల్లో తనకు వచ్చే ఆదాయంతో కొంత సామజిక సేవలకు కూడా వినియోగించే మంచి మనసున్న సూపర్ స్టార్ మహేష్, ఇటీవల ఆంద్ర మరియు తెలంగాణల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు, ఏకంగా వేయిమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. అందుకే ఈస్ట్ ఆర్ వెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈజ్ ద బెస్ట్ అని చెప్పవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: