యంగ్ హీరోలు సినిమాల విషయంలో అసలు తొందరపడడం లేదు. ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. అయితే యంగ్ హీరో నాగశౌర్య మాత్రం ట్రెండ్‌కు భిన్నంగా వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు.


 
ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. మరో రెండు సినిమాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే నాగ‌శౌర్య లేటెస్ట్ మూవీ అశ్వథామ. నూతన దర్శకుడు రమణ తేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య అన్యాయాలను ప్రశ్నించే సామజిక స్పృహ కలిగిన యువకుడిగా నటిస్తున్నారు. కాగా నేడు ఈ మూవీ టీజర్ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ సమంత అక్కినేని విడుదల చేశారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ శౌర్య ఈ చిత్రంలో మాస్ హీరోలా సరి కొత్తగా కనిపిస్తున్నాడు.

 


విశాఖ వేదికగా జరిగే ఓ పెద్ద మెడికల్ మాఫియాతో ఓ యువకుడు చేసే యుద్ధమే `అశ్వథామ` చిత్రం అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. తన స్వార్ధం కోసం అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకొనే ఓ మాఫియా లీడర్ ని నాగ శౌర్య ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ప్రధాన కథ. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో సీరియస్ గా సాగిన అశ్వథామ టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఉషా ములుపురి నిర్మాతగా వ్యవహరిస్తుండగా శ్రీ చరణ్ పాకల సంగీతం అందిస్తున్నారు. మ‌రి ఇంత యాక్ష‌న్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏ మేర‌కు మెప్పిస్తుందో చూడాలి. అలాగే కాస్త స‌స్పెన్స్ కూడా ఈ టీజ‌ర్‌లో క‌నిపించింది. 

 

ఇక ఈ చిత్ర‌మే కాక నాగ‌శౌర్య దర్శకుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్‌లో `ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి`,  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య డైరెక్షన్‌లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే `సుబ్రమణ్యపురం` దర్శకుడు సంతోష్‌తో కూడా ఒక సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇలా వరుసగా నాలుగు సినిమాలు చేస్తూ నాగశౌర్య చాలా బిజీ అయిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: