తెలుగు సినిమాలు వేరే భాషల్లోకి రీమేక్ గా వెళ్తున్నాయి. ఈ మధ్య తెలుగు సినిమాల్లో వచ్చిన మార్పులే దీనికి కారణం. గత ఏడాది నుండి తెలుగు నుండి వేరే భాషల్లోకి వెళ్తున్న రీమేక్ ల సంఖ్య చాలా పెరిగింది. తెలుగులో చిన్న సినిమాగా విడుదల అయిన కేర్ ఆఫ్ కంచరపాలెం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్ తో కొత్త నటీనటులతో ఒక ఊరికి వెళ్ళి అక్కడి వారితోనే షూటింగ్ జరుపుకున్న చిత్రం కేర్ ఆఫ్ కంచరపాలెం.

 

ఈ సినిమాకి వచ్చిన అప్లాజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా చాలా చోట్ల ప్రదర్శితమైంది. ప్రదర్శితమైన ప్రతీ చోట ప్రశంసలు అందుకుంది. ప్రేమకథలో ఉండే భిన్న కోణాలు, వివిధ వయసులలో కలిగే ప్రేమ భావాలు, ప్రేమకు అడ్డుగా నిలిచే వయసు, కులం, మతం, హోదా వంటి విషయాలన్నిటినీ టచ్ చేస్తూ దర్శకుడు మహా వెంకటేష్ చేసిన స్క్రీన్ ప్లే మాయ అబ్బురపరిచింది. అప్పటి వరకు చూడని సినిమాని ప్రేక్షకులకి చూపించాడు దర్శకుడు వెంకటేష్..

 

సమాజంలోని వాస్తవ సంఘటనలకు దగ్గరగా దర్శకుడు ఎంచుకున్న పాత్రలు, నటులు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపు నిజ జీవిత పాత్రలు మన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపూ మన కథే తెర మీద చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి మంచి ఇంటెన్సిటీ ఉన్న కథని తెరకెక్కించిన వెంకటేష్ ని పొగడని వాళ్ళు లేరు. అయితే ఈ చిత్రం ప్రస్తుతం తమిళంలో కేర్ ఆఫ్ కాదల్ అనే పేరుతో తెరకెక్కింది.

 

ఈ చిత్రాన్ని తమిళంలో దర్శకుడు హేమాంబర్ జాస్తి తెరకెక్కిస్తున్నారు. ఎమ్ రాజశేఖర్, కె జీవన్, ఐ బి కార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నారట. మరి తమిళంలో ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: