యాసిడ్ బాధితుల పట్ల సమాజం ఎలా ప్రవరిస్తుంది..? వారి పట్ల సమాజం తీరు ఎలా ఉంటుంది..? ఈ విషయాలు తెలుసుకోవడానికి ఛపాక్‌ మూవీ టీం వినూత్న ప్రయోగం చేపట్టింది. మారు వేషంలో స్టార్‌ హీరోయిన్‌ దీపికా పడుకునే, యాసిడ్‌ బాధితులతో కలిసి ఢిల్లీ వీధుల్లో షాపింగ్‌కు వెళ్లారు. అక్కడ దీపికాకు కొత్త అనుభవాలు ఎదురయ్యాయి.

 

యాసిడ్‌ దాడి బాధితురాలి పట్ల సమాజం తీరు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు  ఛపాక్‌ మూవీ టీం  సరికొత్త ప్రయోగం చేసింది. యాసిడ్‌ దాడి బాధితుల పట్ల సమాజం ఎలా ప్రవర్తిస్తుందో చూపించేందుకు ఛపాక్‌ టీం సూపర్‌ మార్కెట్‌, దుస్తులు, ఫ్యాన్సీ దుకాణాల్లో రహస్యంగా కెమెరాలు ఉంచింది. దీపిక సినిమాలోని మాలతి  గెటప్‌లో తయారై కొంత మంది యాసిడ్‌ దాడి బాధితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. 

 

దుకాణాల్లో యాసిడ్‌ బాధితులను చూసి కొందరు చిరాకు, విసుగు తెచ్చుకున్నారు. మరికొందరు స్నేహంగా పలకరించారు. బాధితుల పట్ల సమాజం తీరు మారాలనే సందేశం ఇస్తూ ఈ వీడియోను రూపొందించారు. దీపికా  టైటిల్‌ రోల్‌ పోషించిన ఛపాక్‌ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. ఆ ట్రైలర్‌లో యాసిడ్‌ బాధితురాలిగా దీపికా అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు  మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించారు. యాసిడ్‌దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది.  ఈ చిత్రం షూటింగ్‌ ఢిల్లీ వీధుల్లో జరుగుతున్నా.. ఎవరూ దీపికను గుర్తుపట్టలేదు.

 

సాధారణంగా దీపిక ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆమె చుట్టూ భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడుతుంటారు. మొత్తానికి ఆమెకు ఇది ఓ కొత్త అనుభవం అని చెప్పొచ్చు. మొత్తానికి ఛపాక్ మూవీ టీం వినూత్న ప్రయోగం.. యాసిడ్ దాడి బాధితుల పట్ల సమాజం ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: