పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది కేంద్ర అధికార పార్టీ బీజేపీ పరిస్థితి. బలమైన పార్టీగా ఆ పార్టీ పైకి కనిపిస్తున్నా రోజు రోజుకి ఆ పార్టీ బలహీనపడుతుండడంతో ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ముఖ్యంగా ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తుండడం ఆ పార్టీ అగ్ర నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే  క్రమంలో ముందుకు వెళ్తే మరింతగా పార్టీ బలహీన పడుతుందనే ఆలోచనలో ఉంది. అందుకే ఇప్పుడు బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో బలపడే దిశగా ప్రయత్నాలు చేస్తూ, ఆయా రాష్ట్రాల్లో ఉన్న నాయకులను బీజేపీ లోకి తీసుకు వచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే ఏపీలో బలపడేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారం తీసుకుంటోంది. ఆ పార్టీతో అధికారికంగా పొత్తు పెట్టుకోవడం ద్వారా రానున్న రోజుల్లో మరింత బలపడాలని బిజెపి ప్లాన్ చేస్తోంది.


 రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లోనూ సెలబ్రెటీలను, సినిమా స్టార్లను బిజెపి వైపు తీసుకువచ్చి తమ పార్టీకి అండగా ఉండేలా చూసుకుంటోంది. తెలంగాణ తో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ లోనూ బిజెపికి పెద్దగా బలం లేకపోవడంతో బలమైన నాయకులను ఎంపిక చేసి వారికి అండగా నిలబడేందుకు సిద్ధం అయ్యింది. మొన్న జరిగిన కర్నాటక ఎన్నికల్లో ఎంపీగా సినీ నటి సినీ నటి సుమలత గెలవడంలోనూ బిజెపి సహాయ సహకారాలు బాగా ఉన్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో సినీ ప్రముఖులను కలుసుకోవడం బిజెపి నేతలకు సర్వసాధారణమైపోయింది.

 

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వారికి అపాయింట్మెంట్ లు ఇస్తున్నారు. ఆ క్రమంలోనే మంచు మోహన్ బాబు కు అపాయింట్మెంట్ ఇచ్చి సుమారు గంటపాటు వారి కుటుంబంతో మాట్లాడారు. తమిళనాడులో కూడా ఇదే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. కొంతకాలం పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ మద్దతు బీజేపీ పొందింది అయితే ఆయన బిజెపిలో చేరేందుకు ఇష్టపడకపోవడంతో పాటు తానే సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్టు తెలియడంతో బిజెపి షాక్ తింది.


 ఇక ఏపీలో బలపడాలంటే పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ బాగా ఉపయోగపడుతుందని, తాము సొంతంగా ఏపీలో బలపడాలి అంటే జనసేన పార్టీకి సాధ్యమయ్యే పని కాదని, అలాగే బీజేపీ కూడా అదే పరిస్థితిలో ఉందనే నిర్ణయానికి రావడంతో తమ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళితే ఫలితం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. ఏపీలో టీడీపీ ఇప్పటికే బాగా బలహీనపడింది. ఆ పార్టీని బలహీన పరచడంలోనూ బాగానే సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా నలుగురు రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకుని టీడీపీకి బలం తగ్గించింది. ఇదే ఫార్ములాను ఉపయోగించి తమ పార్టీలోకి దేశవ్యాప్తంగా సినీ గ్లామర్, సెలెబ్రెటీ హోదా ఉన్ననాయకులను తీసుకురావాలని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: