ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన కథానాయిక రశ్మిక ఇంటిపై ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారులు దాడి చేయడం వెనుక పెద్ద కథే వుంది. వివరాల్లోకి వెళితే... బెంగుళూరుకు 500 కి.లోమీటర్ల దూరంలో కొడగు జిల్లావిరాజపేట సరిహద్దుల్లో రశ్మిక ఇల్లు వుంది. విలాసవంతమైన భవనంవైపు గురువారం తెల్లవారు జామున తాము రశ్మిక అభిమానులమంటూ మూడు కార్లలో ఆమె గృహానికి వచ్చారు. వారంతా ఐటీ అధికారులని సెక్యూరిటీకి తెలీదు. సెక్యూరిటీని కన్నడ భాషలో మాట్లాడి.. లోపలికి ప్రవేశించారు. ఇంటిలో రశ్మిక తండ్రి మదన్‌ మందణ్ణని నిద్రలేపి.. తాము ఐటీ అధికారులమని వివరించారు. ఆ తర్వాత అన్ని ఫోన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఒకేసారి రశ్మిక ఇంటిపై దాడిచేయడమే కాకుండా.. అదే సమయంలో కన్నడ ప్రముఖులైన శివరాజ్‌కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, రాక్‌లైన్‌ వెంకటేష్‌, యశ్‌ ఇళ్ళపైనా దాడులు జరిగాయి. కానీ వారి దాడులు అందుకు తగిన ఆదాయపు పన్నులు లెక్కలు సక్రమంగా వుండడంతో అవి పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కేవలం రశ్మిక ఇంటిపై దాడి గురించే బెంగుళూరు పెద్ద చర్చ జరుగుతుంది.

 

రశ్మిక ఇటీవల తెలుగు చలనచిత్రరంగంలో ఉన్నత శ్రేణి నాయికగా ఎదిగింది. ఆమె నటిస్తే చాలు సినిమా హిట్‌ అనేంతగా పేరు తెచ్చుకుంది. విజయ్‌దేవరకొండతో సినిమా చేయడానికి కేవలం ఆ చిత్ర దర్శకుడు రశ్మిక డేట్స్‌ కోసం వెయిట్‌ చేసి మరీ 'గీత గోవిందం' సినిమా తీశాడు. అది అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు సునాయాసంగా ఎగబాగింది. దీంతో ఆమె ఏడు అంకెల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు బెంగుళూరులో వార్తలు హల్‌చల్‌ చేశాయి. 'కిరాక్‌పార్టీ' తర్వాత ఆమె కేవలం మూడేళ్ళలోనే తెలుగులో భారీ రెమ్యునరేషన్‌ నాయికగా ఎదిగింది. మహేష్‌బాబు చిత్రంలో నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సక్సెస్‌కావడంతోపాటు ఆ చిత్రం వందల క్లబ్‌లో చేరిందంటూ వార్తలు రావడం ఒక కారణంగా, ఇప్పటికే మూడు అగ్రస్థాయి బేనర్‌లో అడ్వాన్స్‌లు కూడా తీసుకున్నదని సమాచారం. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కన్నడ రాజకీయాలు కూడా ఆమెకు ప్రతిబంధకాలుగా మారాయి. ఇప్పటికే రెండు కన్నడ చిత్రాల్లో ఆమె నటిస్తోంది. దానికి సంబంధించిన డేట్స్‌ సరిగ్గా ఇవ్వకపోవడం, మాట్లాడితే మద్రాసు, హైదరాబాద్‌ చుట్టూ తిరగడంతో ఇక్కడి నిర్మాతలకు కంటగింపుగా మారింది. దానికితోడు రాజకీయ కారణాలతో ఆమెను ఏదోవిధంగా కట్టడి చేయాలని చూసినట్లు బెంగుళూరుకు చెందిన వర్గాలు తెలియజేస్తున్నాయి.

 

కష్టపడి నటిగా నిలదొక్కుకోవడం ఒక ఎత్తయితే, పేరు ప్రఖ్యాతులు వచ్చాక దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. ఇందుకు తగిన సపోర్ట్‌ వుండాలి. లేదంటే.. రశ్మికలాగా ఇబ్బందులు పడాల్సిందే. అందుకే ప్రతి నటీనటులు ఏదో రాజకీయ పార్టీలకు అండగా నిలుస్తారు. ఇందుకు తెలుగు, తమిళ, మలయాళ నటీనటులే నిదర్శనం. కన్నడ కంఠీరవకు చెందిన వారసులు తమ తండ్రి పేరును కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు ఆదాయపన్నులు సక్రమంగా కడుతుంటారని ఓ ఐటీ అధికారి వెల్లడించడం విశేషం. ఏదిఏమైనా కన్నడ చిత్రాలకు సరిగ్గా డేట్స్‌ ఇస్తే ఇటువంటి దాడి జరిగేది కాదని బెంగుళూరులో సర్వత్రా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: