సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో పెట్టుబడి రాబట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్ దాటడమే కాదు.. మహేశ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తోంది. ఇంతటి ఘన విజయం ఇచ్చిన అనిల్ రావిపూడికి మరో ఛాన్స్ ఇచ్చేశాడు మహేశ్. 

 

అనిల్ రావిపూడి మహేశ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. హీరో ఎంతోకొంత డైరెక్టర్ కు తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాడన్న శ్రీమంతుడు కాన్సెప్ట్ ను మహేశ్ ఫాలో అవుతున్నాడు. నిన్నకాక మొన్న రిలీజైందో.. ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చేశాడు సూపర్ స్టార్. 

 

మహేశ్ కు ఎవరైనా ఒక హిట్ ఇచ్చారంటే.. ముందు వెనుక ఆలోచించకుండా.. మరో ఛాన్స్ ఇచ్చేస్తాడు. ఒక్కడు మహేశ్ కు క్రేజీ ఇమేజ్ తీసుకొచ్చిందో లేదో గుణశేఖర్ తో కలిసి సైనికుడిలో నటించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చేశాడు. ఇక దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడో లేదో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా శీను వైట్ల దర్శకత్వంలో ఆగడు మూవీ చేశాడు మహేశ్.

 

కొరటాల మినహా మహేశ్ కు ఒక హిట్ ఇచ్చిన దర్శకులందరూ.. రెండో సినిమాతో మెప్పించలేకపోయారు. మహేశ్, కొరటాల శివ కలయికలో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ గాకా.. రెండో మూవీ భరత్ అనే నేను కూడా మెసేజ్ తో అలరించింది. ఈ కాంబినేషన్ వచ్చే రెండేళ్లలో మరోసారి కలవడం ఖాయం. 

 

హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో గ్యాప్ లేకుండా సినిమాలు చేసేయడం మహేశ్ స్టైల్. మహర్షి లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇచ్చిన వంశీ పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ పూర్తికాగానే.. మూడు నెలల పాటు రెస్ట్ తీసుకొని.. వంశీ పైడిపల్లి మూవీలో జాయిన్ అవుతాడు మహేశ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: