కోలీవుడ్ నటుడు సూర్య శివకుమార్ మన తెలుగు ప్రేక్షకులకు సుందరాంగుడు, శివపుత్రుడు సినిమాలతో మంచి సుపరిచితం. ఇక ఆ తరువాత మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన గజినీ సినిమా సూపర్ హిట్ కొట్టి తెలుగులో సూర్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడినుండి సూర్య సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవడం, మంచి సక్సెస్ సాదించడం జరుగుతున్నాయి. అయితే గత కొన్నాళ్లుగా మాత్రం సూర్య నటిస్తున్న సినిమాలేవీ కూడా తెలుగులో పెద్దగా సక్సెస్ కావడం లేదు. మరోవైపు తమిళ నాట కూడా సూర్య తన ఫ్యాన్స్ ఆశించే రేంజ్ లో సక్సెస్ లు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. 

 

ఇక ఇటీవల బందోబస్త్, ఎన్జీకే సినిమాలతో ముందుకు వచ్చిన సూర్య ఆ సినిమాల ఘోర పరాజయాలతో మరొక్కసారి ఆలోచనలో పడ్డారని అంటున్నారు. వాస్తవానికి మొదటి నుండి ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేయడం వల్లనే సూర్యకు సరైన సక్సెస్ దక్కడం లేదనే విమర్శలు కూడా కోలీవుడ్ వర్గాల్లో వినపడుతున్నాయి. ఇక ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సూర్య, అతి త్వరలో ఇటీవల ధనుష్ తో అసురన్ సినిమాను తీసిన వెట్రి మారన్ దర్శకత్వంలో ఒక మాస్ సినిమాలో నటించనున్నారు. అయితే ఇటీవల ఆకాశం నీ హద్దురా టీజర్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. 

 

ఆ టీజర్ ని బట్టి చూస్తుంటే, ఆ సినిమా కూడా సూర్య గత సినిమాల మాదిరిగా ఒక ప్రయోగాత్మక సినిమా అని కొంత వరకు మనకు అర్ధం అవుతోంది. అయితే తదుపరి వెట్రి మారన్ దర్శకత్వంలో చేయబోయే సినిమా మాత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ అని, ఆ సినిమాలో సూర్య క్యారెక్టర్ అదిరిపోవడంతో పాటు ఆయన ఫ్యాన్స్ కి ఎంతో నచ్చుతుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే, ఆ సినిమాతో సూర్య మళ్ళి లైన్ లోకి వచ్చినట్లే. కాగా అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఆ సినిమాను దసరా సమయంలో రిలీజ్ చేయనున్నట్లు టాక్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: