శంక‌రాభ‌ర‌ణం ఈ చిత్రాన్ని కళా తపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ప‌తాకం పై  ఏడిద నాగేశ్వరరావు – ఆకాశం శ్రీరాములు దీన్ని నిర్మించారు. శంకరశాస్త్రి, తులసి మధ్య అలవికాని అనుబంధం చక్కగా ఆవిష్కరించిన సినిమా. ఇది ఒక్క తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటక, కేరళ లలో కూడా అఖండ విజయం సాధించింది. అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్ట మొదటి చిత్రం ఇదే. అలాగే ప్రపంచ నలు మూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది . అప్పట్లో ఎవరి నోట విన్నా ‘శంకరాభరణం’ గురించే ప్రస్తావన .

 

శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో  ఈ సినిమా విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు. ప్రతి తెలుగు వాడు ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు. ఇక అవార్డుల విషయానికి వస్తే, జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు, వినోదాత్మకం తో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకుంది. 

 

త‌ల్లి వేశ్య వృత్తి కొన‌సాగించాల‌ని కూతురిపై ఓ విటుడితో రేప్ చేయిస్తుంది. క‌ళలను ఆరాధించే తులసి, శంకరశాస్త్రిని గురుభావంతో ఆరాధిస్తుంది. వేశ్యకు ఆశ్రయం ఇచ్చారని శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూస్తారు. తన వల్ల శంకరశాస్త్రి నిందలు పడవలసి రావడం తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక పుత్రుడికి తల్లి అవుతుంది. శంకరశాస్త్రి దగ్గర నేర్చుకోవడానికి అతన్ని నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును ఆయన సంగీతానికి వారసుడిగా నియమిస్తుంది. కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ఆమె కూడా ప్రాణాలు విడుస్తుంది. ఈ క‌థ‌కు క‌న్నీళ్లు ఎంత మాత్రం ఆగ‌వని చెప్ప‌డానికి ఏమాత్రం సంకోచించ‌క్క‌ర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: