తెలుగు సినిమా చరిత్రని ఒక మలుపు తిప్పిన సినిమా శంకరాభరణం... ఈ సినిమా గూర్చి తెలియని వాళ్ళు, వినని వాళ్ళు అసలు ఉండరు. ఈ సినిమా విడుదలై ఈరోజు అనగా ఫిబ్రవరి 02 నాటికీ అక్షరాలా 40 సంవత్సరాలు పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికి కూడా శంకరాభరణం సినిమా అంటే మంచి కళాత్మక దృశ్య కావ్యం లాంటి సినిమా అని అంటారు అందరు...

 

నలభై సంవత్సరాలు అయినాగానీ సినిమా పేరుని గాని, సినిమాల్లో పాత్రలు గాని, సన్నివేశాలు గాని, పాటలు గాని గుర్తు ఉన్నాయంటే ఈ సినిమా గొప్పతనం గూర్చి వేరే చెప్పాల్సిన పనిలేదు.. ఈ తరం వాళ్ళకి శంకరాభరణం సినిమా గూర్చి తెలియాల్సిన అవసరం ఉంది.. నాలుగు ద‌శాబ్దాల శంక‌రాభ‌ర‌ణం సినిమాలో డైలాగ్స్ ఈనాటికి ఎంతో ఆలోచింపచేసేలా ఉంటాయి. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఆలోచింపచేసేలా ఉంటుంది.. ఆ డైలాగ్ మీద ఒక లుక్ వేద్దామా..

 



'ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు.. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది. తాదాత్మ్యం పొందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి గంగాజలంలా పెల్లుబికిన భావమది, గీతమది. ఆధునికత పేరుతో, మిడి మిడి జ్ఞానంతో మన పూర్వీకులు మనకిచ్చిన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమమైన సంగీతాన్ని నాశనం, అపభ్రంశం చేయకయ్యా!'. అనే డైలాగ్ అందరిని ఆకర్షింపచేసింది... ఈ సినిమాలో నటించిన అందరు ఎవరి పాత్రలకి వారు జీవం పోశారు..

 

రారా కృష్ణయ్య’లో నటించిన జొన్నలగడ్డ వెంకట సోమయాజులుని శంకరశాస్త్రి పాత్ర కోసం తీసుకున్నారు. అలాగే మంజు భార్గవి కూడా అప్పటికి పెద్ద పేరున్న నటేమీ కాదు. ఇక షూటింగ్‌కు వెళ్లాక ప్రతి షాటునీ శ్రమతో, ప్రతి దృశ్యాన్ని శ్రద్ధతో తీశారు. మొదటి కాపీ వచ్చిన తర్వాత వాళ్లంతా చూసి విశ్వనాథ్‌కి జేజేలు పలికారు.

 

ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కు ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలి సారి జాతీయ అవార్డు , శ్రీమతి వాణిజయరాం కు ఉత్తమ గాయకురాలిగా , కె.వి.మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించిన సినిమా ఇది . అలాగే మన ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులతో పాటు, దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: