తెలుగు సినీ పరిశ్ర‌మ‌. రాష్ట్ర విభ‌జ‌న వ‌ర‌కూ మొత్తం హైద‌రాబాద్ కేంద్రంగానే ఉండేది. ఇప్పుడు అక్కడే ఉంది. పూర్తిగా హైదార‌బాద్ కేంద్రంగానే సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన స‌మావేశాలు..ఎన్నిక‌లు..నిర్ణ‌యాలు సాగుతున్నా యి. రాష్ట్ర విభజన అయ్యిందగ్గర నుండి హైదరాబాద్ నుండి సినీ పరిశ్రమ ఏపికి తరలి వెళిపోతుందని ఎందరో ప్రముఖులు ఎన్నో సార్లు చెప్పారు. ఇక‌, ఏపీలో సినీ ప‌రిశ్ర‌మ గురించి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో కొంద‌రు సినీ ప్ర‌ముఖులు వ‌చ్చి నాడు స‌మావేశ‌మ‌య్యారు. విశాఖ కేంద్రంగా సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ది చేస్తామ‌ని నాటి ప్ర‌భుత్వం చెప్పింది. కానీ విభజన జరిగి ఇన్నేళ్లు అయినా ఒక్క ఇంచైనా కదిలిందా? కదలలేదు. 

 

ఎందుకంటే విభజన నాటి ఉద్రిక్త వాతావరణం ఇపుడు హైదరాబాద్ లో లేదు. పైగా సినీ పరిశ్రమ ప్రముఖులతో తెలంగాణా ప్రభుత్వం చాలా సన్నిహిత సంబంధాలు మెయిన్ టైన్ చేస్తోంది. దాంతో సినీ పరిశ్రమ పెద్దలు హైదరాబాద్ ను వదిలేసి ఏపికి రావాలని  అనుకోవటం లేదు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో.. చిరు, నాగార్జునలతో మంత్రి తలసాని భేటీ అయ్యారు.  ఈ స‌మావేశంలో సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ది, సినీ క‌ళాకారుల‌కు అందాల్సిన సంక్షేమ ప‌థ‌కాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. అలాగే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా.. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి సహాయమైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమంటూ మంత్రి తలసాని పేర్కొన్నట్లు సమాచారం. 

 

దీంతో పాటు చిన్న సినిమాల‌కు ఎదుర్కొంటున్న థియేట‌ర్ స‌మ‌స్య‌ల‌ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించ‌డం విశేషం. అదే విధంగా ఈ భేటీలో తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించిన పలు విషయాలతో పాటు తాజాగా రాజకీయ అంశాలు వీళ్ల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. కాగా,  మొన్నటి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంగా టీఆర్ఎస్  ప్రభంజనం వీచడం.. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తలసానిని చిరు, నాగార్జున‌లతో భేటి కమ్మని ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: