సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్‌ హాసన్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం భారతీయుడు-2. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం సంభవించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘటనతో తమిళ సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. అందులో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. 

 

మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో డైరెక్టర్ శంకర్ కూడా ఉన్నారు. శంకర్ కాలు బోన్ ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో శంకర్‌తో పాటు గాయపడ్డవారికి చెన్నైలోని సవిత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కమల్ హాసన్ సెట్స్ లోనే ఉన్నారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బుధవారం రాత్రి ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఈ ఘటన జరిగింది. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా ఇక్కడే జరుగుతోంది. ఈ మేరకు లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి క్రింద ఉన్న టెంట్‌పై పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 

 

ఈ ఘటనలో టెంట్ కింద ఉన్న వారిలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. భారీ క్రెయిన్ కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసి తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. పలువురు సినీప్రముఖులు ఘటనా స్థలానికి వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఫోన్ చేసి ఘటనపై తెలుసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: