సినిమా బాగుంటే.. తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమా అయినా చూస్తారు. హీరో ఎవరు.. దర్శకుడు ఎవరు.. జానర్ ఏంటి అని పట్టించుకోరు. ఎంటర్ టైన్ చేసే సినిమాలను అయితే నెత్తిన పెట్టుకుంటారు. ఏడాది నుంచి సక్సెస్ అయిన మూవీస్ లిస్ట్ చూస్తుంటే.. ఇందులో ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ ఎక్కువగా కనిపిస్తాయి. 

 

తెలుగు ప్రేక్షకులు హాస్యప్రియులు. రిలాక్స్ అవ్వాలన్న మైండ్ సెట్ తో సినిమాకు వెళ్తారు. ఇందుకోసం ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ ను ఎంచుకుంటారు. ఏ సినిమా అయితే బోర్ కొట్టకుండా.. ఎక్కువగా నవ్విస్తుందో ఆ సినిమానే చూడాలనుకుంటారు. గత వారం రిలీజైన భీష్మ ఎంటర్ టైన్ చేయడంతో.. నితిన్ కు నాలుగేళ్ల తర్వాత హిట్ ఇచ్చారు. 

 

తెలుగు ఆడియన్స్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ కు బ్రహ్మరథం పడతారు. త్రివిక్రమ్ మాటల్లో ఉండే కామెడీకి ఫిదా అయిపోతారు. అందుకేనేమో.. అల వైకుంఠపురములోనూ బ్లాక్ బస్టర్ చేసి 150కోట్లకు పైగా తీసుకొచ్చారు. నాన్ బాహుబలి రికార్డ్ కట్టబెట్టారు. ఎలాంటి కథ అయినా.. కామెడీతో కథనాన్ని నడిపిస్తే చాలు. ఇలాంటి చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఢోకా లేదు. ఎంటర్ టైన్ మెంట్ చేయడంలో ఎక్స్ పర్ట్ అయిన అనిల్ రావిపూడి.. సరిలేరు నీకెవ్వరుతో హిట్ కొట్టాడు. 

 

కామెడీ ఉంటేనే సినిమా హిట్ అవుతుందని కాదు కానీ.. ఎంటర్ టైన్ మెంట్ చేసే సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంది. నవ్వించకుండానే ఖైదీ.. ఎవరు లాంటి సినిమాలు అలరించాయి. కాకపోతే.. ఆద్యంతం నవ్వించిన సినిమాల సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటోంది.

 

ప్రతీరోజు పండుగే సినిమాలో చావును కూడా పెళ్లిలా చేసి నవ్వించాడు దర్శకుడు మారుతి. పెద్దవాళ్లను చూసుకోవాలన్న మెసేజ్ ఇస్తూనే బోర్ కొట్టకుండా నవ్విస్తూ చెప్పడం ఆడియన్స్ కు నచ్చింది. 

 

వరుణ్ తేజ్ గద్దలకొండ గణేశ్ తమిళ చిత్రం జిగర్తాండకు రీమేక్ గా రూపొందింది. తమిళంలో లేని కామెడీని జోడించి ఎంటర్ టైన్ మెంట్ గా మలిచాడు దర్శకుడు. దీంతో సినిమా బాక్సాఫీస్ ను మెప్పించింది.

 

ఏడాది నుంచి సక్సెస్ సినిమా సరళిని చూస్తుంటే.. ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ నే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. ఎఫ్ 2 నుంచి భీష్మ వరకు ఇలాంటి చిత్రాలే ఎక్కువగా కనిపిస్తాయి. బ్రోచేవారెవరురా లాంటి చిన్న చిత్రాలను కూడా హిట్ చేశారు తెలుగు ఆడియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: