తెలుగు సినిమా పరిశ్రమలో గయ్యాళి అత్తగారి పాత్రలకు పెట్టింది పేరైన సూర్యకాంతం గురించి మనకు తెలుగు వారికి ఎంతో సుపరిచితం. ముఖ్యంగా ఆ తరహా పాత్రల్లో ఆమెకు ముందుగా ఎంతో గుర్తింపు తెచ్చిన సినిమా గుండమ్మ కథ. ఆ సినిమాలో గుండమ్మగా ఆమె పోషిచిన పాత్రనే సినిమా టైటిల్ గా పెట్టారంటే సూర్యకాంతం యొక్క గొప్పతనం, నటిగా ఆమె ప్రత్యేకత ఏంటో గ్రహించవచ్చు. ఇక గుండమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరుకు మన ప్రేక్షకులు ఏ విధంగా ముగ్ధులయ్యారంటే, అప్పట్లో ఆమె ఎవరైనా తమ సన్నిహితుల ఇళ్లకు శుభకార్యాలకు వెళ్లిన సందర్భంలో ఆమెను గయ్యాళిగానే ఆ వేడుకలకు వచ్చిన ఆడవారు భావించేవారట. అయితే ఇదంతా నాణానికి ఒకవైపే అని చెప్పాలి. ఎందుకంటే ఆమె సినిమాల్లో పోషించిన పాత్రలు ఎంత గయ్యాళివ, దానికి పూర్తి విరుద్ధంగా సూర్యకాంతమ్మ మనసు ఎంతో గొప్పదట. ఇక ఆమె ఎవరి సినిమా అయితే చేస్తున్నారో, ఆ సెట్ లోని వారందరికీ తానే స్వయంగా పదార్ధాలు ఇంటి నుండి వండి తీసుకువచ్చేవారట. 

 

ముఖ్యంగా అప్పటి నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటే ఆమెకు ఎంతో ప్రీతీ అని, వారికి పలు రకాల వంటలు వండి వడ్డిస్తుండడంతో, సూర్యకాంతమ్మ వల్ల మా శరీర బరువు ఎంతో పెరుగుతోంది అంటూ అప్పట్లో అన్న గారు సరదాగా వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయట. కాకినాడ వద్ద గల వెంకట కృష్ణరాయపురం గ్రామంలో జన్మించిన సూర్యకాంతం, చిన్నప్పటి నుండి డ్యాన్స్, నటన వంటి వాటిలో ఎంతో ఆసక్తిని కలిగి ఉండేవారని, ఆ మక్కువతోనే అప్పట్లో మద్రాసు చేరుకొని సినిమా అవకాశాలు సంపాదించారని తెలుస్తోంది. మొట్టమొదట చంద్రలేఖ సినిమాలో ఒక నర్తకి గా ప్రారంభం అయిన ఆమె కెరీర్, ఆ తరువాత సంసారం సినిమాతో మెల్లగా గాడిలో పడింది. ఇక ఒకానొక సమయంలో ఆమెకు ఒక హిందీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడం జరిగిందట. 

 

అయితే ఆ ఛాన్స్, తనకంటే ముందుగా మరొక నటికి దక్కడం, ఆమె స్థానంలో తనను తీసుకోవాలని నిర్మాతలు భావించడం సూర్యకాంతం కు నచ్చలేదట. వేరొకరికి రావలసిన అవకాశాన్ని నేను దక్కించుకుని ఆనందంగా జీవించలేను అంటూ ఆమె ఆ ఛాన్స్ ని వదులుకున్నారట. ఇక తన ఇంటికి ఎవరు వచ్చినా సరే, కడుపు నిండుగా భోజనం పెట్టనిదే ఆమె వెళ్లనిచ్చేవారు కాదట. ఇక చివరిలో ఆమె మంచంలో ఉన్న సమయంలో కూడా ఇంటికి ఎవరైనా వస్తే, కడుపు నిండి భోజనం చేసి వెళ్ళండి, తప్పుగా భావించకండి నేను మీకు లేచి వడ్డించలేను అని ఆమె అనేవారట. ఎంతైనా అంతటి గొప్ప మనసున్న నటీమణుల గురించి తెలుగు కళామతల్లితో పాటు ప్రేక్షకుల కూడా వారిని ఎప్పటికీ మరిచిపోలేరు అనే చెప్పాలి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: