ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా కలకలం.. ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది.  ఒకప్పుడు ఎయిడ్స్ అంటే మందు లేదు.. నివారణ ఒక్కటే మార్గం అనేవారు.  ఇప్పుడు కరోనా పరిస్థితి అలాగే ఉంది.. మందు లేదు నివారణ, సురక్షితంగా ఉండటమే మేలు.. లేదంటే కరోనా కాటేస్తుందని హెచ్చరిస్తున్నారు.  చైనాలో పుహాన్ లో మొదలైన ఈ భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలో వ్యాపించింది.  అయితే భారత దేశంలో కూడా కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఇది వైరస్ కావడంతో వాతావరణ పరిస్థితులు.. కలుషితం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. వెంటనే వ్యాప్తి చెందుతుందని డాక్టర్లు అంటున్నారు.

 

  ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటూ బయటకు వెళ్లినపుడు మాస్కులు ధరించడం మంచిదని అంటున్నారు.  ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వ్యాపార రంగంపైనే కాదు.. ఏకంగా సినీ పరిశ్రమను కూడా గందరగోళంలో పడేసింది.  ఇప్పటికే కొన్ని సినిమాలు నిరవదిక వాయిదా వేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా  కరోనా ఎఫెక్ట్ తో 21వ ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డుల (ఐఫా) ఉత్సవం వాయిదా పడింది. మార్చి చివరిలో భోపాల్‌లో ఈ వేడుకను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరిగాయి.  కరోనా ఎఫెక్ట్‌ తో సభలు, సమావేశాలు రద్దు చేసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం సాధ్యమైనంత వరకు ప్రజలు గుంపులుగా ఏర్పడవద్దని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో  ఐఫా ఉత్సవాలు వాయిదా వేసుకోవడం మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించాల్సి ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత 'ఐఫా' వేడుకల్ని వాయిదా వేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. గతకొద్ది రోజులుగా కరోనా వైరస్  ప్రపంచాన్ని గజగజ వణికిస్తుంది.  ఈ నేపథ్యంలో ఎవరైనా ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేసుకోవడానికి ధైర్యం చేయలేని పరిస్థితి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: