పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి వకీల్ సాబ్ ఈ పాటికే రిలీజ్ కావలసి ఉంది, అయితే గత కొద్దిరోజులుగా మన దేశంలో కరోనా ఎఫెక్ట్ వలన లాక్ డౌన్ కొనసాగుతుండడంతో మిగతా వాటితో పాటు ఆ సినిమా షూటింగ్ కూడా నిలుపుదల చేయబడింది. ఇక వీటి రెండిటి తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ మరొక సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ని తీసుకుంటున్నట్లు కాసేపటి క్రితం దర్శకుడు హరీష్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసారు. 

 

పవన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ ఈ కాంబినేషన్ మరొక్కసారి సెట్ అవడం ఎంతో ఆనందంగా ఉందని దేవీశ్రీ సంతోషాన్ని వ్యక్తం చేసారు. కాగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు టాక్. ఇకపోతే మరోవైపు ఈ ఏడాది మొన్నటి సంక్రాంతి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్, ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించనే లేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో యువ దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ, తన నెక్స్ట్ మూవీ ని మహేష్ తో చేయబోతున్నానని, అతి త్వరలో దానికి సంబంధించి అధికారిక సమాచారం వెలువరిస్తాం అని చెప్పడం జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఈ నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ప్రకటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 

 

ఇకపోతే ముఖ్యంగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకుంటారు అనే చర్చ మాత్రం కొద్దిరోజులుగా టాలీవుడ్ లో హాట్ హాట్ గా సాగుతోంది. కొందరేమో గోపి సుందర్ అంటుంటే మరికొందరేమో థమన్ అంటున్నారు, మరోవైపు మణిశర్మ అనే పేరు కూడా వినపడుతోంది. మరి ఈ విషయమై ఎవరు ఫైనల్ అయ్యారో ఏమిటో అర్ధం కాక సూపర్ స్టార్ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లబోయే పవన్ సినిమాకు ఇప్పటినుండే అన్నీ సిద్ధం చేస్తుంటే, అతి త్వరలో ప్రారంభం కానున్న తమ హీరో సినిమా విషయమై ఇప్పటివరకు ఏ న్యూస్ కూడా బయటకు రాకపోవడం ఒకింత సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తోంది. మరి ప్రచారం అవుతున్న విధంగా ఈ నెల 31న మహేష్, పరశురామ్ మూవీ గురించి అధికారిక ప్రకటన వస్తే మాత్రం వారికి పండగే అని చెప్పాలి. అప్పుడే సినిమాకు సంబంధించి అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: