లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.. ఈపేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన విజయశాంతి.. దాదాపు 13 ఏళ్ల తర్వాత మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. వాస్త‌వానికి విజ‌య‌శాంతి సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది.  అయితే జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 

 

1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనదంటూ ఓ గుర్తింపుకోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. విజ‌య‌శాంతికి మొద‌టి నాలుగేళ్లలో ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. అయితే ఈమెకు తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో వ‌చ్చిన `నేటి భారతం`. ఈ చిత్రం త‌ర్వాత తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన హీరోయిన్ల‌ను సవాలు చేస్తూ మరో తారగా ఉద్భవించింది విజ‌య‌శాంతి. 

 

అటుపై అందొచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని ఒక నటిగా ఎదిగింది. అయితే ఎన్నో విజ‌యాలు అందుకున్న విజ‌య‌శాంతి కెరీర్‌లో విషాదాలు కూడా ఉన్నాయి. విజ‌య‌శాంతికి  కేవ‌లం 17 ఏళ్లున్న‌పుడే తండ్రి చనిపోయారు.. ఆ త‌ర్వాత ఏడాది కాలంలోనే త‌ల్లి కూడా చ‌నిపోవ‌డంతో ఆమె  ఒంటరి అయ్యారు. ఆ స‌మ‌యంలో ఆమె‌ను తిన్నావా.. ఉన్నావా.. ప‌డుకున్నావా అని అడిగే వాళ్లు లేరు. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం అదైర్య‌ప‌డ‌కుండా ముందుకు సాగింది. ఈ క్ర‌మంలోనే  ఎన్నో విజ‌యాల‌ను త‌న సొంతం చేసుకుంది. ఇలా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండ‌స్ట్రీలో హవా కొన‌సాగించిన ఈ రాములమ్మ‌ నేడు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఇలాంటి పుట్టిన‌రోజులు ఆమె మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుందాం.

  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: